ఒక ఎన్నికల అధికారికి రాజకీయ పార్టీలతో సాన్నిహిత్యం ఏమిటో అనే ప్రశ్నలకు, వాటి తాలూకు అనుమానాలకు మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు! ఈ విషయాలపై అధిష్టాణం ఆర్డర్ మేరకు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు వివరణ ఇచ్చారు కానీ.. లేదంటే వారు కూడా తప్పించుకు తిరుగువాడు దన్యుడు సుమతీ పద్దతే ఫాలో అయ్యేవారు! ఆ సంగతులు అలా ఉంటే.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం (రహస్య) భేటీ పై వివరణ ఇవ్వలేదు.. సరికదా ఏపీ ఎన్నికల అధికారిగా కుర్చుంటానంటున్నారు! అది ఆయన హక్కు, ఆయనకున్న అవకాశం అవ్వొచ్చు కానీ… నైతికత అని ఒకటి ఉంటుంది కదా అనేది పలువురి ప్రశ్న!
అసలు రహస్య భేటీ అనంతరం నైతిక బాధ్యత అనో.. తన నిజాయితీపై ప్రజలకు నీలినీడలు కమ్ముకున్నాయనో.. తన పదవికి రాజినామా చేస్తున్నాను.. అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటిస్తారని చాలా మంది నైతికత కలిగిన వ్యక్తులు భావించారు. కానీ… అది జరగలేదు సరికదా, ఏపీ ప్రభుత్వం తనపై నిఘా పెట్టిందని.. కొందరు వ్యక్తులు తనను నీడలా వెంటాడుతున్నారని.. తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని.. తాను విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లకుండా భారీగా పోలీసులను మోహరించారని నిమ్మగడ్డ రమేష్ కుమార్.. గవర్నర్ కు రాసిన లేఖలో ఆరోపించారు! ఆయన ఆరోపణలు అలా ఉంటే… ఇలా లేఖలు రాసి ఈ (రహస్య) భేటీ వివాదాన్ని దృష్టి మరలుస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి నిజాయితీపై నీలినీడలు కమ్ముకుంటోన్న తరుణంలో.. ప్రజలు తమ ఓట్లకు న్యాయం జరుగుతుందని, తమ అభిప్రాయాలు సరిగ్గానే నమోదవుతాయని అనుమానాలు రావడంలో తప్పేమీ లేకపోవచ్చు. ఎవరికి ఏ అనుమానాలు వస్తే ఏమిటి.. ఎవరు ఎలాంటి భయాలు పెట్టుకుంటే నాకేమిటి.. తన నిజాయితీ గురించి జనాలు ఏమనుకుంటే నాకేమిటి.. నైతికత గురించి ఎవరు ఎలాంటి ఆలోచనలు చేస్తే నాకేమిటి.. తాను మాత్రం ఎన్నికల అధికారిగా కూర్చుంటాను, బీజేపీ – టీడీపీ నేతలతో తనకు (రహస్య) సంబంధాలు ఉన్నా కూడా.. తాను ఆ పదవిలో కూర్చుంటాను, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిస్తాను అన్నట్లుగా రెడీ అవుతున్నారు నిమ్మగడ్డ!!
నిమ్మగడ్డ కు ఎన్నికల అధికారిగా కొనసాగే హక్కు ఉండొచ్చు.. హైకోర్టు తీర్పు ప్రకారమో, తెలుగుదేశం కోరిక ప్రకారమో.. ఆయన ఎన్నికల అధికారిగా కొనసాగొచ్చు! కానీ… అంతకంటే ముందు ఏపీ ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాస్తే బాగుంటుంది అని అంటున్నారు జనాలు! పార్క్ హయత్ వ్యవహారంపై స్పందిస్తూ.. తన నిజాయితీ గురించి ఎవరూ ఏమీ తప్పుగా అనుకోవద్దు అంటూ.. ఆ భేటీ ఎందుకు జరిగింది అనే విషయాలపై ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చి.. అనంతరం ఆ కుర్చీలో కూర్చుంటే బాగుంటుందని.. దాన్నే నైతికత అంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.