బతికుండగానే సమాధి అవ్వడం గురించి విన్నాం. బతికుండగానే కొందరు తమ సమాధులను నిర్మించుకోవడం చూశాం. కానీ బతికుండగానే తన తద్దినం తానే పెట్టుకున్నాడు ఓ వృద్ధుడు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజంగా జరిగింది. ఎక్కడంటే..?
బిహార్‌లోని ముజఫర్‌పుర్ జిల్లా సక్రా బ్లాక్‌లోని భారతీపూర్ గ్రామానికి చెందిన హరిచంద్ర దాస్ (75) ఏడాది క్రితం బతికి ఉండగానే తన దినకర్మను చేసుకున్నాడు. ఇప్పుడు అతడు తన తద్దినం పెట్టుకున్నాడు. మొదటి సారి తన దినకర్మను చేయాల్సిందిగా ఇంట్లో వాళ్లను అడగగా.. వారందరూ షాక్‌కు గురయ్యారు. అలా చేయొద్దని కుటుంబ సభ్యులు సహా గ్రామస్థులు సూచించారు.
కానీ ఆయన అందుకు నిరాకరించాడు. చేసేదేమీలేక వారు దినకర్మ చేసేందుకు అంగీకరించారు. హరిచంద్ర దాస్ తాజాగా తన తద్దినాన్నీ పూర్తి ఆచార వ్యవహారాలతో జరుపుకొన్నాడు. అనంతరం విందు కూడా ఏర్పాటు చేశాడు. ‘‘నా మరణానంతరం కొడుకులిద్దరూ తద్దినం సరిగ్గా పెడతారో? లేదో? అన్న సందేహం వచ్చింది. అందుకే నా ఆబ్దీకాన్ని నేనే పెట్టుకోవాలని నిశ్చయించుకున్నాను’’ అని హరిచంద్ర తెలిపారు. ఈ కాలం కొడుకులపై నమ్మకం లేని తల్లిదండ్రులు చివరకు చనిపోయిన తర్వాత చేయాల్సిన కర్మను కూడా బతికుండగానే వారే చేసుకుంటున్నారు.