తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి అనే పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగ తాజా గా మన ఊరు మన బడి పథకం మార్గ దర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ పథకంపై గురు వారం రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాగ ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ కు మన ఊరు మన బడి సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ బాధ్యతలను అప్పగించింది. 10 రోజుల్లో సాఫ్ట్ వేర్ ను తయారు చేయాలని టీసీఎస్ ను తెలంగాణ విద్యా శాఖ కోరింది.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మొదటి దశలో రూ. 3,497 కోట్లు వెచ్చించబోతున్నట్టు తెలిపారు. ఈ మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35 శాతం అంటే.. 9,123 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఈ పథకం కోసం తక్షన అవసరాల కోసం రూ. 150 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యా శాఖ కోరింది. పాఠశాలలకు అవసరం అయ్యే పరికరాలు సెంట్రలైజ్డ్ ఏజెన్సీ నుంచి సరఫరా చేసుకోనున్నారు. పాఠశాలలకు కావాల్సిన ఇసుకను ఉచితంగా సరఫరా చేయాల్సిన బాధ్యత ఆయా గ్రామాల సర్పంచ్ లదే అని అన్నారు.