కరోనా వైరస్ ప్రభావం వల్ల ఇప్పటికే అనేక రంగాలకు భారీ నష్టం కలుగుతోంది. మాల్స్, సినిమా హాళ్లు, జిమ్‌లు.. తదితర అనేక ప్రదేశాలను మూసివేయడంతో అనేక మందికి భారీగా నష్టం సంభవిస్తోంది. అయితే కరోనా వైరస్ రైతులనూ విడిచిపెట్టడం లేదు. ముఖ్యంగా ఈసారి మామిడి రైతులకు కరోనా వైరస్ వల్ల భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మామిడి సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు పంటలను ఎగుమతి చేసుకోలేక ఇబ్బందులు పడుతారని తెలుస్తోంది.
మన దేశంలో పండే మామిడి పంటలో 40 శాతం పండ్లు విదేశాలకు ఎగుమతి అవుతాయి. అయితే ఈ సారి ఎగుమతులు భారీగా తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులకు భారీ నష్టాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. పండ్లను ఉత్పత్తి చేశాక రవాణా చేసేందుకు అవకాశం లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో తమకు నష్టం వస్తుందని వారు విచారిస్తున్నారు. సాధారణంగా మన దేశంలో పండిన మామిడి పండ్లు ఎక్కువగా గల్ఫ్, యూరప్ దేశాలు, అమెరికాకు ఎగుమతి అవుతాయి. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో పండ్ల ఎగుమతి సాధ్యం కాకపోవచ్చని, అదే జరిగితే తమకు నష్టాలు వస్తాయని రైతులు అంటున్నారు.
ఇక మన మామిడి పండ్లకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంటుంది. కానీ ఈ సారి కరోనా వైరస్ వల్ల మామిడి పండ్ల ఎగుమతిపై ప్రభావం పడనున్న నేపథ్యంలో రైతులు ఏవిధంగానైనా సరే నష్టాలను తప్పించుకునేందుకు పండ్లను ఎగుమతి చేయాలని భావిస్తున్నారు. అందుకు గాను వారు విమానమార్గం కాకుండా సముద్ర మార్గం ద్వారా పండ్లను ఎగుమతి చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అయితే మామిడి పండ్ల సీజన్ ఆరంభమైతేనే గానీ రైతుల సమస్య ఓ కొలిక్కి రాదు. మరి కరోనా అప్పటి వరకు తగ్గుతుందా, లేదా చూడాలి..!