సిసోదియా.. తప్పుడు ఈ-మెయిళ్లు క్రియేట్ చేశారు : ఈడీ

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురుని అరెస్టు చేసింది. మరికొందరిని విచారించింది. ఇక దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాను ఈడీ విచారిస్తోంది. తాజాగా సిసోదియాకు సంబంధించి ఓ కీలక విషయాన్ని ఈడీ అధికారులు తెలిపారు.

దిల్లీ మద్యం విధానానికి ప్రజామోదం ఉందని చాటుకునేందుకు దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా కొన్ని తప్పుడు ఈ-మెయిళ్లను సృష్టించారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఆరోపించారు. ఎక్సైజ్‌ కుంభకోణానికి సంబంధించి నగదు అక్రమ చలామణి కింద అరెస్టయిన సిసోదియా.. బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ప్రత్యేక న్యాయస్థాన న్యాయమూర్తి ఎం.కె.నాగ్‌పాల్‌కు ఈడీ తరఫు న్యాయవాది బుధవారం ఈ విషయం తెలిపారు.

ఎక్సైజ్‌ శాఖ అధికారిక ఈ-మెయిల్‌ ఖాతాకే కాకుండా సిసోదియా వ్యక్తిగత ఖాతాకు కూడా కల్పిత ఈ-మెయిళ్లు వెళ్లినట్లు తమవద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. తన ఎజెండాకు సరిపోయేలా వీటిని ఆయన సృష్టించి, దిల్లీ మైనారిటీల కమిషన్‌ ఛైర్మన్‌ జకీర్‌ ఖాన్‌కు ఇచ్చారనీ, వాటిని మంత్రికి పంపించాల్సిందిగా ఖాన్‌ తన అనుచరులకు సూచించారని తెలిపారు. తదుపరి విచారణ ఈ నెల 18న జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news