పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్రకు పవన్ కుటుంబ సభ్యుల ఆర్ధిక చేయూత అందజేశారు. కౌలు రైతుల భరోసా యాత్ర ప్రత్యేక నిధికి రూ.35 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ సదర్భంగా పవన్ కళ్యాణుని కలిసి చెక్కులను కుటుంబ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మేము ఇంట్లో ఎప్పుడు కూడా రాజకీయాలు గురించి మాట్లాడుకోమని, కుటుంబ సభ్యులుగా రాజకీయాల్లో నేను ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరుకుంటారు తప్ప.. రాజకీయాల గురించి నాతో చర్చించరన్నారు. జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర చూసి, ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాల దయనీయ స్థితి గురించి తెలుసుకొని కదిలిపోయారని, వారి బిడ్డల భవిష్యత్తుకు ఎంతో కొంత అండగా ఉండాలనే సదుద్దేశంతో ముందుకు వచ్చి ఆర్ధిక సాయం అందించారన్నారు.
వరుణ్ తేజ్ రూ.10 లక్షలు, సాయిధరమ్ తేజ్ రూ.10 లక్షలు, వైష్ణవ్ తేజ్ రూ.5 లక్షలు, నిహారిక రూ.5 లక్షలు అందించారు. వీళ్ళు రాజకీయంగా తటస్థంగా ఉంటారు. రైతుల కష్టాలకు చలించిపోయారు. వీరిలో సేవా దృక్పథం ఉంది. సాయిధరమ్ తేజ్ ఇప్పటికే వృద్ధాశ్రమాన్ని నిర్మించాడు. ఓ పాఠశాలకు తన వంతు అండగా నిలిచి సేవ చేస్తున్నాడు. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇప్పటికే పలు స్వచ్చంద సంస్థలకు ఆర్థిక తోడ్పాటు ఇస్తూ సామాజిక సేవల్లో భాగమవుతున్నారు. ఈ మధ్య ఒక చిన్న పాప తాను దాచుకున్న కిడ్డీ బ్యాంకును తీసుకొచ్చి నాకు ఇచ్చింది. ఆ చిన్నారి తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు అంటూ పవన్ వ్యాఖ్యానించారు.