టిక్‌టాక్ మ్యాట‌ర్ ఓవ‌ర్‌..? కొనుగోలు చేయ‌నున్న మైక్రోసాఫ్ట్‌..?

చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదం నేప‌థ్యంలో భార‌త్ చైనాకు చెందిన 59 యాప్‌ల‌ను నిషేధించిన సంగ‌తి తెలిసిందే. మ‌రో 250 వ‌ర‌కు యాప్‌ల‌ను నిషేధించాల‌ని భార‌త్ భావిస్తోంది. ఇక ఆ యాప్‌ల‌లో ఒక‌టైన టిక్‌టాక్‌ను త్వ‌ర‌లో అమెరికా కూడా బ్యాన్ చేస్తుంద‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా మ‌రొక ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేమిటంటే…

microsoft may purchase tiktok in usa

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్.. టిక్‌టాక్‌ను కొనుగోలు చేస్తుంద‌ని, ఇందుకు గాను టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్‌తో మైక్రోసాఫ్ట్ చ‌ర్చ‌లు జ‌రుపుతుంద‌ని తెలుస్తోంది. అయితే టిక్‌టాక్‌కు చెందిన అమెరికా బిజినెస్‌ను మాత్ర‌మే మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేస్తుంద‌ని అంటున్నారు. అంటే మిగిలిన దేశాల్లో టిక్‌టాక్‌కు హ‌క్కులు అదే కంపెనీకి ఉంటాయా, మైక్రోసాఫ్ట్‌కు వెళ్తాయా.. అనేది తేలాల్సి ఉంది. ఇక టిక్‌టాక్ మార్కెట్ విలువ ప్ర‌స్తుతం 30 బిలియ‌న్ల నుంచి 50 బిలియ‌న్ డాల‌ర్ల మ‌ధ్య ఉంటుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

అయితే టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే నేప‌థ్యంలో మైక్రోసాఫ్ట్ ఆ యాప్ మొత్తాన్ని కొనుగోలు చేస్తుందా, లేక అమెరికా వ‌ర‌కు హ‌క్కులు ఉండేలా కొనుగోలు చేస్తుందా.. అన్న విష‌యం తేలాల్సి ఉంది. కానీ టిక్‌టాక్ మొత్తాన్ని కొనుగోలు చేసే ప‌క్షంలో స‌ద‌రు యాప్ మ‌ళ్లీ భార‌త్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇక మ‌రో వారం రోజుల్లో ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని అంటున్నారు. కాగా.. ఈ విష‌య‌మై అటు మైక్రోసాఫ్ట్‌, ఇటు టిక్‌టాక్ ఏవీ అధికారికంగా స్పందించ‌లేదు.