అమరావతి: రాష్ట్ర ప్రతిష్టని దిగజార్చే విధంగా టీడీపీ ప్రయత్నిస్తోందని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడకూడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు మనో ధైర్యం ఇచ్చే బాధ్యత ప్రతిపక్షంపై ఉందా? లేదా అని మంత్రి ప్రశ్నించారు.
కరోనా కారణంగా స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇచ్చామని చెప్పారు. ఇంటర్ పరీక్షలు వాయిదా వేశామని గుర్తు చేశారు. ఆన్ లైన్‌లో విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశించామని చెప్పారు. విద్యా సంవత్సరాన్ని కాపాడే విషయంలో ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదన్నారు. పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థుల భవిష్యత్ బాగుంటుందని చెప్పారు. పరిస్థితులు చక్కబడిన తరువాత పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటిస్తామని వ్యాఖ్యానించారు.
ఇక కడప జిల్లాలో పేలుడు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కడప జిల్లా మామిళ్ళపల్లె శివారులో జరిగిన పేలుడు ఘటన అధికారులతో మాట్లాడారు. సంఘటన కారణాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ లను అడిగి తెలుసుకున్నారు. మరణించిన వారి కుటుంబాలకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకోవటం జరుగుతుందని హామీ ఇచ్చారు.