గుజరాత్ మంత్రి అరవింద్ రయాని చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇనుప గొలుసులతో తన వీపు కేసి బాదుకుని.. మూఢనమ్మకం కాదని చెప్పుకొచ్చారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. రాజకీయ నాయకుడై.. మూఢ నమ్మకాలను ఎలా ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే మంత్రి అరవింద్ రయాని గొలుసులతో బాదుకుంటే.. పక్కనే ఉన్న కొందరు వ్యక్తులు మంత్రిపై కరెన్సీ నోట్లు చల్లుతున్నారు. ఈ విషయాన్ని బీజేపీ కూడా సమర్థించడం గమనార్హం.
గురువారం రాజ్‌కోట్‌లో ఒక మతపరమైన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి మంత్రి హాజరై అక్కడి దేవతా పూజలో భాగంగా ఇనుప గొలుసులతో తనని తాను శిక్షించుకున్నారు. దీంతో పక్కనున్న ఒక వ్యక్తి మంత్రిపై కరెన్సీ నోట్లు వెదజల్లడంతో ఆ వీడియో కాస్త వైరల్ అయింది. అయితే ఈ విషయంపై మంత్రి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి నేను అమ్మవారి భక్తుడిని. మా స్వగ్రామంలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇది మూఢ నమ్మకం కాదు.. మా దేవతపై మాకున్న నమ్మకం.’’ అని అన్నారు.