మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యాపారాలు, వ్యాపకాలు ఎక్కువేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. అందుకే నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించలేకపోయారని అన్నారు. నిలకడలేని ఆయన మనస్తత్వం వల్ల నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని వ్యాఖ్యానించారు. సూర్యాపేటతో సమానంగా మునుగోడును అభివృద్ధి చేస్తున్నామని.. గట్టుప్పల్ మండలంగా ఏర్పడాలన్న ప్రజల కలను సాకారం చేశామని తెలిపారు. కేసీఆర్ హయాంలో ఫ్లోరిన్ రహిత నియోజకవర్గంగా మునుగోడు మారిందని చెప్పారు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అబద్ధాలతో పబ్బం గడుపుతున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఆరు నెలల్లో ఒక్కసారి కూడా నియోజకవర్గంలో అడుగుపెట్టని వ్యక్తి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని జగదీశ్‌రెడ్డి విమర్శించారు.
‘‘మునుగోడు నియోజకవర్గం హైదరాబాద్‌కు దగ్గర్లో ఉన్నప్పటికీ పట్టించుకునే నాయకుడు లేక అభివృద్ధిలో వెనకబడిపోయింది. ఒక గ్రామంలో ప్రారంభమైన ఫ్లోరైడ్ మహమ్మారి .. ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా ఎదిగారో అలాగే ఎదిగి మొత్తం జిల్లాను ఆక్రమించి ప్రజల్ని పిప్పిచేసింది. స్థానిక ఎమ్మెల్యే ఆరు నెలలకు ఒక్కసారి కూడా నియోజకవర్గానికి వచ్చింది లేదు. కాంట్రాక్టులు, వ్యాపారాల్లో బిజీగా ఉంటూ కల్యాణ లక్ష్మి చెక్కులు పంచేందుకు ఆయనకు తీరిక లేకపోవడంతో నేనే స్వయంగా వచ్చి ఊరూరా పంపిణీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది’’ అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.