తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..
గతంలో ఎన్నడూ లేని విధంగా హుజూరాబాద్, మునుగోడులోనే ఎన్నికలు డబ్బు మయం అయ్యాయని ఆరోపణలు వచ్చాయని మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఆయన ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ వ్యవహరించిన తీరును తూర్పారబట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజలను సూటిగా ఒక్క మాట అడుగుతున్నా. ఎన్నికలు డబ్బు మయం అయ్యాయని కొందరు ఆక్రోషిస్తున్నారు. నేను సూటిగా అడుగుతున్నా.. ఇదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనిమిది సంవత్సరాల్లో ఎన్నో ఉప ఎన్నికలు వచ్చాయి. నారాయణఖేడ్, పాలేరు, దుబ్బాక, హుజూర్‌నగర్, నాగార్జున సాగర్‌లో ఎక్కడా ఈ పరిస్థితి లేదు? ఎందుకు హుజూరాబాద్‌లో, మునుగోడులోనే డబ్బులు మయం అయ్యాయని ఆరోపణలు వచ్చాయ్? వందల కోట్ల రూపాయలు వచ్చినయ్? ఎందుకంటే ఈటెల రాజేందర్ అనే ధనవంతుడు, కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి అనే ధనవంతుడు.. వీళ్లిద్దరు దిగిన తర్వాత ఉప ఎన్నికలు ధనమయమయ్యాయి’ అని కేటీఆర్ మండిపడ్డారు. ‘ఈటల, కోమటిరెడ్డితోనే హుజూరాబాద్, మునుగోడులో ఉప ఎన్నిక కలుషితమైంది.
ఇతర ఏ ఎన్నికల్లో కూడా నాగార్జున సాగర్, హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు ఇదే నల్లగొండ జిల్లాలో జరిగినా ఇలాంటి అడ్డమైన ఆరోపణలు రాలే. ఇక్కడ మాత్రమే వచ్చాయి.. తెలంగాణ ప్రజలను నేను అడుగుతున్నా.. ఆలోచించండి. డబ్బు మయం అయ్యాయంటే ఎవరు చేస్తన్నారు. ధనవంతులను తీసుకొచ్చి ధనస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ పార్టీ కాదా? ఇద్దరు ధనవంతులకు వందలకోట్ల రూపాయలు ఢిల్లీ నుంచి పంపి తిమ్మిని బమ్మి చేసైనా గెలవండి అని ఆదేశమిచ్చి.. ఈ రోజు ఎన్నికల్లో అడ్డదారులు తొక్కుతున్నది.. అడ్డంగా దొరికింది బీజేపీ కాదా? నేను చెబుతున్నది వాస్తవం కాదా? మేం అడ్డదారులు తొక్కి ఉంటే.. 40 ఐటీ టీమ్‌లు, 15 కంపెనీల సీఆర్‌పీఎఫ్ పోలీసులు వీరంతా లేరా? ఇవాళ నోటికివచ్చినట్లు బీజేపీ నేతలు కారుకూతలు కూస్తున్న బీజేపీ నాయకులు’ అని ధ్వజమెత్తారు కేటీఆర్.