దురదృష్టవశాత్తు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులు ఆలస్యం : మంత్రి కేటీఆర్‌

-

రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో వెల్స్పన్ ఇండియా లిమిటెడ్ అధునాతన టెక్స్‌టైల్ యూనిట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 500 కోట్ల పెట్టుబడితో ఈ టెక్స్‌టైల్ యూనిట్ ఏర్పాటైంది. ఈ సందర్భంగా సంబంధిత కంపెనీ కీలక ప్రకటన చేసింది. కాళేశ్వరం, మిషన్ భగీరథ తరహాలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి… మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రజాప్రతినిధులు, వెల్ స్పన్ ప్రతినిధులు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో పూర్తి చేసిందన్న కేటీఆర్… దురదృష్టవశాత్తు కొన్ని కారణాలతో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని కేటీఆర్ అన్నారు. ఐదేళ్ల కింద చందన్ వెల్లిలో ఒక్క పరిశ్రమ కూడా లేదని… ఇపుడు చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయని చెప్పారు. భవిష్యత్‌లో తెలంగాణలో అతిపెద్ద పారిశ్రామిక సమూహంగా ఈ ప్రాంతం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గుజరాత్ నుంచి వచ్చి వెల్‌స్పన్ ఇక్కడ భారీ పెట్టుబడి పెట్టిందన్న మంత్రి… రాబోయే ఐదేళ్లలో చందన్ వెల్లిలో 3000 నుంచి 5000 కోట్ల పెట్టుబడి పెడతామన్న సంస్థ అధినేత బాలకృష్ణ గోయెంకాకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక మహిళలను భాగస్వామ్యుల్ని చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్‌స్పన్ ప్రతినిధులు చెప్పడం సంతోషకరమని అన్నారు. చందన్ వెల్లిలో తయారయ్యే సగం ఉత్పత్తులు సిలికాన్ వ్యాలీకే వెళ్తాయన్న వెల్ స్పన్ గ్రూప్ ఛైర్మన్ బాలకృష్ణ గోయెంకా… రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టి చందన్ వెల్లిని వెల్ స్పన్ వ్యాలీగా మారుస్తామని అన్నారు. మంత్రి కేటీఆర్ విజన్.. చందన్ వెల్లి టు సిలికాన్ వ్యాలీ అన్న ఆయన… సీఎం కేసీఆర్ అద్భుత దార్శనికతతో ముందుకెళ్తున్నారని ప్రశంసించారు.

Read more RELATED
Recommended to you

Latest news