కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాస్టర్ ప్లాన్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు రైతులు యత్నించారు. రోడ్డుపై పోలీసులు ఏర్పాటు చేసిన భారీ కేట్లను తొలగించి ముందుకు వెళ్లారు రైతులు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించిన రైతులు అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతుల ఆందోళనపై స్పందించారు మంత్రి కేటీఆర్. సమస్య ఎలా వచ్చిందని మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ స్టేజ్‌లో ఉందని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోయారు? అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ప్రజాభిప్రాయం మేరకే మార్పులు చేస్తామని చెప్పవచ్చు కదా? అని అధికారులపై మండిపడ్డారు.
కామారెడ్డిలో ఇండస్ట్రియల్ జోన్ పడిందని ఆందోళన చేస్తున్నారని.. ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదన్నారు. సాయం చేసేందుకే ఉన్నాం అన్న మంత్రి.. నగరాల అభివృద్ధి కోసమే మాస్టర్ ప్లాన్ రూపకల్పన అన్నారు. మాస్టర్ ప్లాన్‌పై ప్రజల నుంచి అభ్యంతరాలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలి” అని అధికారులకు సూచించారు మంత్రి కేటీఆర్.