ఏపీ ప్రభుత్వం వ్యవసాయ వద్ద మోటర్లకు మీటర్లు బిగించనున్నట్లు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పరిపరి విధాలుగా రైతుల్లో నెలకొన్ని అనుమానాలను నివృత్తి చేయడానికి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి ఎంతమేర విద్యుత్ వినియోగం అవుతుందన్న విషయాన్ని తెలుసుకునేందుకే సాగు మోటార్లకు మీటర్లను బిగిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని పక్కనపెట్టేసి సాగు మోటార్లకు మీటర్ల బిగింపుపై విపక్ష టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు పెద్దిరెడ్డి.
విద్యుత్ చౌర్యం, అక్రమాలను అరికట్టేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ట్రాన్స్‌కో అధికారులకు పెద్దిరెడ్డి సూచించడంతో.. అప్రమత్తతతోనే విద్యుత్ చౌర్యం, దుర్వినియోగం, నష్టాలను నియంత్రించగలమని ఆయన పేర్కొన్నారు. గృహ వినియోగంతో పాటు పారిశ్రామిక విద్యుత్ వినియోగంపైనా తనిఖీలు చేపట్టాలని, తనిఖీల ప్రక్రియ నిరంతరంగా కొనసాగేలా చూడాలంటూ అధికారులను ఆదేశించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.