భానుడి భగభగలకు చెమటలకు కక్కుతున్న జనాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. అయితే బుధవారం తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. పలు జిల్లాల్లో ఈ నెల 21 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు తూర్పు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ పేర్కొన్నది.
ఉత్తర-దక్షిణ ద్రోణి.. పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది వాతావరణ శాఖ. వాతావరణంలో వస్తున్న మార్పులతో పాటు నైరుతి రుతుపవనాల ఆగమనం మొదలు కావడంతో మంగళవారం ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అత్యధికంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ములుగు జిల్లా ఏటూరునాగరంలో 2.56 సెంటీమీటర్ల వర్షం కురిసింది.