వైసీపీలో కోల్డ్ వార మొదలైంది. సొంత నేతలే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత పార్టీ నేతలను బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయితే నిన్నటి ఆయన వ్యాఖ్యలు కాస్త శృతి మించటంతో దానికి మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. రఘురామకృష్ణంరాజు మూడు పార్టీలు తిరిగినా ఎవరూ సీటివ్వలేదని, చివరికి వైసీపీ సీటిచ్చిందని తెలిపారు. గతంలో ఎన్నికల్లో నామినేషన్ వేసి ఎందుకు ఉపసంహరించుకున్నారో చెప్పాలని నిలదీశారు. తాను కాబట్టే నరసాపురంలో గెలిచానని, తన వల్లే నరసాపురం లోక్ సభ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలకు ఓట్లు పడ్డాయని రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు కూడా పేర్ని నాని బదులిచ్చారు. ఎమ్మెల్యేలకు ఎన్ని ఓట్లు వచ్చాయో, మీకు ఎన్ని ఓట్లు వచ్చాయో ఓసారి సరిచూసుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్ బొమ్మ, జగన్ కష్టం వల్లే వైసీపీలోని ఎమ్మెల్యేలు గెలిచారని మంత్రి స్పష్టం చేశారు. సొంత అవసరాల కోసం పార్టీలోకి వచ్చి, ఆ తర్వాత కనిపించడంలేదని విమర్శించారు. తమను గెలిపించిన జగన్ పట్ల చచ్చేవరకు విశ్వాసంతో ఉంటామని పేర్ని నాని అన్నారు.