ఏపీ ప్రజలకు విడదల రజిని శుభవార్త..వారికి మందుల సరఫరా

-

గిరిజన ప్రాంతాల నుంచి విశాఖ పట్నం కేజీహెచ్‌కు నవజాత శిశువులను చికిత్సకు తీసుకువచ్చేటప్పుడు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు వైద్యాధికారులకు సూచించారు. రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలు పూర్తిగా అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య ఆరోగ్య శాఖను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే చింతూరు వంటి మారుమూల గిరిజన ప్రాంతానికి 40 ఏళ్లుగా డాక్టర్‌ లేని దుస్థితిని తప్పిస్తూ ఇప్పుడు స్పెషలిస్టు డాక్టర్‌ను నియమించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి రజిని గారు పేర్కొన్నారు.

గిరిజన ప్రాంతాల్లో ఎక్కడా వైద్య సిబ్బంది, మందుల కొరత మాటే తలెత్తకుండా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారని, ఇందుకోసం ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడరాదని ముఖ్యమంత్రి గారు తమ శాఖకు సూచనలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇంకా ఏమైనా వైద్య పరంగా అవసరాలున్నా, ఎక్కడి నుంచి ఏ ప్రతిపాదన వచ్చినా, ముఖ్యమంత్రి గారు తక్షణమే ఆమోదించి, ఆ అవసరాలను తీర్చడానికి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని ఆమె చెప్పారు. వెద్య ఆరోగ్య శాఖ చరిత్రలోనే ఇదొక విప్లవాత్మక పరిణామమని మంత్రి రజిని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుంతల సచివాలయం పరిధిలోని కిండ్లం గ్రామంలో ఇటీవల సంభవించిన ఆరుగురి మరణాలపై గిరిజనులు భయాందోళనలు చెందకుండా వారిని తగిన విధంగా చైతన్యవంతులను చేయాలని మంత్రి రజిని గారు వైద్యాధికారులను ఆదేశించారు. ఇటీవల చనిపోయిన ఆరుగురు ౖహైబీపీ, ఖైనీ నమలడం, మూఢ నమ్మకాలతో నాటువైద్యం చేయించుకోవడం వంటి కారణాలతో చనిపోయారని వైద్యాధికారులు మంత్రికి వివరించారు. విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు, అరకు, పాడేరు ఎమ్మెల్యేలు, పాడేరు ఐటీడీఏ అధికారి గోపాలకృష్ణ, వైద్యాధికారులతో శుక్రవారం మంత్రి మంగళగిరిలోని తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

సికిల్‌సెల్‌ ఎనీమియా, తలసేమియా వ్యాధులకు సంబంధించి, అన్ని మందులు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా ఒక ప్రణాళికను రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇంకా వైద్యాధికారులు సూచించే మందులను కూడా సరఫరా చేసేలా ఈ ప్రణాళికలో పొందుపరుస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా అరకు, పాడేరు ఎమ్మెల్యేలు ఫల్గుణ, భాగ్యలక్ష్మిలు, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్రలు తమ ప్రాంత వైద్య అవసరాల గురించి మంత్రికి విన్నవించగా, ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి రజిని హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వర్తించే వ్యాధుల జాబితాలు సచివాలయాలు, ఆరోగ్యమిత్రల వద్ద ఉన్నాయని, ఈ సమాచారం మరింత విస్తృతంగా ప్రచారంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి చేసిన సూచనకు మంత్రి బదులిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news