ఓబుళాపురం అక్రమ గనుల తవ్వకాల (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులోని నిందితులపై కోర్టు అభియోగాలను నమోదు చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ మినహా… ఈ కేసులోని
నిందితులందరిపైనా కోర్టు అభియోగాలు నమోదు చేసింది. అంతేకాకుండా ఈ అభియోగాలపై నవంబర్ 11 నుంచి సాక్షుల విచారణను చేపట్టాలని కూడా కోర్టు నిర్ణయించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టే కారణంగా శ్రీలక్ష్మీపై అభియోగాల నమోదును సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో .ప్రధాన నిందితుడిగా ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో పాటు… ప్రస్తుతం తెలంగాణ విద్యా శాఖ మంత్రిగా కొనసాగుతున్న సబితా ఇంద్రారెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, రిటైర్డ్ అధికారులు కృపానందం, వీడి రాజగోపాల్, ఓఎంసీ కంపెనీ, అలీఖాన్ తదితరులపై కోర్టు అభియోగాలు నమోదు చేసింది. వీరంతా శుక్రవారం నాటి కోర్టు విచారణకు స్వయంగా హాజరయ్యారు.
ఇదిలా ఉంటే.. అక్టోబర్ 10న మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌ను రద్దు చేసింది. బెయిల్‌లో మార్పులు చేయాలంటూ ఆయన కొద్దిరోజుల కిందటే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. దీనిపై ఇదివరకే విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. అక్టోబర్ 10న తన నిర్ణయాన్ని వెల్లడించింది.