నిన్న ఉదయం నుంచే ట్యాంక్‌బండ్‌వైపు వినాయక విగ్రహాలు బారులు తీరాయి. దీంతో ఎల్బీ స్టేడియం, అబిడ్స్ వరకు నిమజ్జనం కోసం వచ్చిన వినాయకులు భారీగా నిలిచిపోయారు. ఇక సికింద్రాబాద్ వైపు నుంచి ట్యాంక్‌బండ్‌కు పెద్ద సంఖ్యలో గణనాథులు తరలివచ్చారు. తీరొక్క వినాయక విగ్రహాలు, యువకుల నృత్యాలు, డీజే పాటలు, బ్యాండ్ సౌండ్లతో హైదరాబాద్ వీధులు మారుమ్రోగాయి. ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం కూడా ఘనంగా పూర్తి అయ్యింది. అనంతరం వినాయకుల నిమజ్జనాలు ఊపందుకోనున్నాయి.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో అత్యంత ఘనంగా జరగడంతో పాటు, నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. చిన్న, పెద్ద వినాయకులు అన్ని కలుపుకొని సుమారు 2 లక్షల వరకు విగ్రహాలను ప్రతిష్టించి, నిమజ్జనం చేసినట్లు పేర్కొన్నారు. ఉత్సవాల ప్రారంభం నుండి నిమజ్జనం జరిగే వరకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రభుత్వం అన్ని శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయలేదని పేర్కొన్నారు. ఒక వైపు వర్షం కురుస్తున్నా అలసిపోకుండా, ఆలస్యమైనప్పటికీ నిమజ్జనం పూర్తయ్యే వరకు ఎంతో ఓపికతో సహకరించిన, ఎంతో బ్రహ్మాండంగా జరిగేలా సహకరించిన ఉత్సవాల నిర్వహకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, పోలీసు, ట్రాఫిక్, శానిటేషన్, హెల్త్, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులను, సిబ్బందిని మంత్రి అభినందించారు.