రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సచివాలయంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మంత్రులు సత్యవతి రాఠోడ్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి పాల్గొన్నారు. సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, దేశపతి శ్రీనివాస్ హాజరయ్యారు. వేడుకల నిర్వహణపై మంత్రులు అధికారులతో సమాలోచనలు జరిపారు.
ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. గత 9 సంవత్సరాలలో ప్రభుత్వ శాఖలు సాధించిన విజయాలను
ప్రస్తావిస్తూ, నిర్దేశించిన రోజున ఉత్సవాలు నిర్వహించుటకు తగు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గత తొమ్మిదేళ్లలో పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను చేపట్టి ప్రజల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ఈ ఉత్సవాలలో ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా ఘనంగా నిర్వహించాలని సూచించారు. రాజధాని హైదరాబాద్‌లో జూన్ 2వ తేదీన నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని, జిల్లా కేంద్రాలలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో, మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పాల్గొంటారని ఆయన తెలిపారు.