అక్కరకురాని మంత్రులు .. అదరగొట్టేస్తున్న ఎమ్మెల్యేలు ?

-

ఎమ్మెల్యేలతో పోలిస్తే మంత్రులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అధికారాలు, హోదాలు, ప్రోటోకాల్ ఇలా ఎలా చూసుకున్నా ఎమ్మెల్యేల కంటే మంత్రులు అన్ని విషయాల్లోనూ పై చేయి తమదే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే రాజకీయపరమైన విమర్శలు వచ్చిన సందర్భంలో మంత్రులు తమదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ , పెద్ద ఎత్తున విమర్శలు చేయడమే కాకుండా, ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొడుతూ, ప్రభుత్వానికి అండగా నిలబడుతూ ఉంటారు . కానీ విచిత్రంగా ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న చాలామంది ఈ విషయంలో వెనకబడి పోవడం చర్చనీయాంశంగా మారింది. అంటే ఎమ్మెల్యే లే సమర్థవంతంగా ఉన్నట్టుగా అక్కడ వాతావరణం నెలకొంది. జగన్ మంత్రి మండలి లో ఉన్నవారిలో రాజకీయ ఉద్దండులు సంఖ్య తక్కువ.

సామాజిక వర్గాల సమతూకంలో పదవులు పొందిన వారే ఎక్కువ. వీరికి పదవులు ఇచ్చేందుకు జగన్ మొదటి నుంచి తన వెంట నడిచిన, తనకు అత్యంత సన్నిహితులైన వారిని సైతం పక్కనపెట్టి చాలామంది కొత్తవారికి అవకాశం కల్పించారు. అయితే ప్రతిపక్షాలు చేసే విమర్శలపై వీరంతా మౌనంగానే ఉండిపోతూ ఉండడం, అదే సమయంలో ఎమ్మెల్యేలుగా ఉన్న సీనియర్లు జగన్ కు అండగా నిలబడే విధంగా ప్రతి విమర్శలు చేయడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా , గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఇలా చెప్పుకుంటూ వెళితే ఎమ్మెల్యేలు చాలామంది ప్రభుత్వానికి, పార్టీకి అండగా నిలబడుతూ, అన్ని విషయాల్లోనూ ప్రతిపక్షాలది పై చేయి కాకుండా చూడడం లో సక్సెస్ అవుతూ వస్తున్నారు.

ఇక మంత్రులలో కొడాలి నాని, కురసాల కన్నబాబు, సిదిరి అప్పలరాజు, పేర్ని నాని వంటి వారు మాత్రమే ప్రతిపక్షాల పై విమర్శలు చేస్తూ అండగా నిలబడుతున్నారు మెజారిటీ మంత్రులు తమ శాఖలకు సంబంధించిన విషయాలపై పూర్తిగా మాట్లాడ లేని పరిస్థితుల్లో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. సామాజిక వర్గాల లెక్కలు వేసుకుని జగన్ మంత్రి మండలిని ఏర్పాటు చేసుకున్నా, మిగతా విషయాల్లో వారి పనితీరు అంతంత మాత్రంగా ఉండడం వైసీపీకి ఇబ్బందికరంగానే మారింది.

Read more RELATED
Recommended to you

Latest news