అదేంటి ఆశ్చర్యంగా ఉందా ? టీడీపీ నేతలకు వైసీపీ సర్కారులో మంత్రిపదవులా ? అని నోరెళ్ల బెడుతు న్నారా? గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుని చంద్రబాబు మంత్రి పదవులు ఇస్తే.. ఇచ్చారే మో.. కానీ.. జగన్ అలా చేస్తారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా? ఇప్పుడు దీనిపైనే వైసీపీలో చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికలలోపు టీడీపీకి కీలక నేతలు లేకుండా చేయాలనేది వైసీపీలక్ష్యం. ఆలోపే.. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లేకుండా చంద్రబాబును నిలువుకాళ్లపై నిలబెట్టాలనేది మరో కీలక వ్యూహం. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి నేతలను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే.
కుమారుల కొసం కొందరు.. అభివృద్ధి చూసి వచ్చామని కొందరు ఇలా.. నలుగురు వరకు గెలిచిన నాయకులు టీడీపీ సైకిల్ దిగేశారు. అయితే, ఇంకొందరు కీలక నేతలు మాత్రం వస్తామని అంటున్నారే తప్ప.. రావడం లేదు. వీరిలో మాజీ మంత్రి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వంటి వారు ఉన్నారు. వీరు రావడానికి ఇబ్బంది లేదు. కానీ, వీరి షరతులే ఇబ్బందిగా ఉన్నాయి. వీరిద్దరూకూడా తమకు మంత్రి పదవులు కావాలని డిమాండ్ చేస్తున్నట్టుతాజాగా ఓ నాయకుడు బాంబు పేల్చారు.
నిజానికి గంటా విషయంలో దీనిని సరే! అడిగే ఉంటారులే! అని సర్దుకోవచ్చు.కానీ, అనగాని విషయంలో ఇది నిజమేనా? అని ఆరాతీస్తే.. పదవి ఎవరికి మాత్రం చేదు! అనే విషయమే బయటకు వచ్చింది. అంటే.. ఆయన కూడా మంత్రి పదవి ఇస్తే.. వస్తాను అనే షరతును వైసీపీ నేతల వద్ద వ్యక్తీకరించారనేది వాస్తవమేనని తెలుస్తోంది. ఈ విషయంలో ఎటూ తేలక పోవడంతోనే ఇద్దరూ స్టాండ్‌బైలో ఉండిపోయారు. అయితే, ఇప్పుడు తమ రాజ్యాంగాన్నిమార్చుకునే పనిలో జగన్ ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు.
అంటే.. మరో ఏడాదిలో కేబినెట్‌ను పునర్వ్యస్థీకరించే పని ఉంది. అప్పటికి వీరిని పార్టీలోకి తీసుకుని, కుదిరితే బైపోల్‌కు వెళ్లి గెలిపించుకుని.. తర్వాత కేబినెట్‌లో బెర్త్‌లు ఇస్తే ఎలా ఉంటుందనే విషయంపై తాజాగా జగన్-విజయసాయిరెడ్డి-సుబ్బారెడ్డి-బాలినేని శ్రీనివాసరెడ్డి-సజ్జల రామకృష్నారెడ్డి తదితరులు చర్చించినట్టు తాడేపల్లి వర్గాలు చూచాయగా చెబుతున్నాయి. ఇది కొలిక్కి వస్తే.. ఇక, టీడీపీ నేతలకు కనీసం రెండు వరకు బెర్త్‌లు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.