ఏపీలోని రైతులకు శుభవార్త చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాపై సంపూర్ణ హక్కు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోందని, ఉచిత విద్యుత్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) పథకం, వ్యవసాయానికి 9 గంటల పగటి పూట ఉచిత విద్యుత్ అమలుపై ఆదివారం విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధిదారులైన రైతులెవరూ కరెంట్ బిల్లుల కోసం ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి.
నెలవారీ విద్యుత్ బిల్లులు మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని, వారి ఖాతాల నుంచి నేరుగా డిస్కంలకు బిల్లులు చెల్లించడం వల్ల నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఆ డిస్కంలను డిమాండ్ చేసే హక్కు రైతులకు లభిస్తుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి. విద్యుత్ సంస్థలకు వివిధ కారణాల వల్ల వచ్చే నష్టాలను రైతులపైకి నెట్టేయకుండా నిరోధించేందుకు మీటర్లు ఉపయోగపడతాయని వివరించారు మంత్రి పెద్దిరెడ్డి. ఒక రైతుకు ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉండాలనే అంశంపై ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించదని స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. అనధికార, అధిక లోడ్ కనెక్షన్లు కూడా క్రమబద్దీకరిస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి. కౌలు రైతులకు కూడా దీనివల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవన్నారు మంత్రి పెద్దిరెడ్డి.