తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్యే పోరు ఆసక్తికరంగా మారింది. అసలు అధికార టీఆర్ఎస్కు పూర్తిగా మద్ధతు ఉన్నా సరే భయపడే పరిస్తితి ఉంది. ముఖ్యంగా కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరులో టీఆర్ఎస్కు వణుకు వస్తుంది. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్సీ పోరులో రవీందర్ సింగ్ నిలబడ్డారు. మొన్నటివరకు ఈయన టీఆర్ఎస్లోనే ఉన్నారు. కానీ ఈయనని కాదని..మొన్ననే పార్టీలోకి వచ్చిన ఎల్ రమణకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. దీంతో ఆయన టీఆర్ఎస్ని వీడి ఎమ్మెల్సీ పోరులో నిలబడ్డారు.
ఇక ఈయనకు ఈటల రాజేందర్ మద్ధతు ఫుల్‌గా ఉంది. అసలు ఆయన సపోర్ట్‌తోనే రవీందర్ ఎమ్మెల్సీ బరిలో నిలబడ్డారు. మామూలుగా కరీంనగర్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్ నుంచి ఎల్. రమణ, భాను ప్రసాదరావు బరిలో దిగారు. అసలు ఈ రెండు స్థానాలు గెలిచే మెజారిటీ టీఆర్ఎస్కు ఉంది అయినా సరే..రవీందర్‌సింగ్ టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగడంతో.. పోటీ రసవత్తరంగా మారింది. విపక్ష పార్టీలు రవీందర్ సింగ్‌కు మద్ధతు ఇస్తున్నాయి.
అయినా సరే రవీందర్ సింగ్‌కు గెలిచే అవకాశాలు లేవు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. టీఆర్ఎస్కు చెందినవారు..కొందరు క్రాస్ ఓటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈటల కొందరిని రవీందర్‌కు మద్ధతు తెలిపేలా ప్లాన్ చేసినట్లు తెలిసింది. టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు…ఒక ఓటు టీఆర్ఎస్కు వేసి…మరొక ఓటు రవీందర్ సింగ్‌కు వేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
అయితే ఒక నేత కూడా చేజారిపోకుండా మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌లు చూసుకుంటున్నారు. ఇప్పటికే వారు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపుల్లోనే మాక్ పోలింగ్‌పై అవగాహన కల్పిస్తున్నట్టు సమాచారం. అలాగే క్యాంపుల నుంచి తిరిగి రాగానే వారికి మరోసారి ఓటింగ్‌పై అవగాహన కల్పిస్తారని తెలుస్తోంది. వీరందరినీ పోలింగ్ రోజున నేరుగా కరీంనగర్ తీసుకెళ్లే ఆలోచనలో నాయకులు ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఈటల తన వ్యూహాలతో ముందుకెళుతూనే ఉన్నారు. పరోక్షంగా కొందరు టీఆర్ఎస్ నేతలతో టచ్‌లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా రవీందర్‌ని గెలిపించుకోవడమే లక్ష్యంగా ఈటల పనిచేస్తున్నారు. మరి చూడాలి ఈటల ప్లాన్ ఏ మేర వర్కౌట్ అవుతుందో?