నా లైఫ్ ‘ముత్యాలముగ్గు’ సినిమా హీరోయిన్‌లా తయారైంది : జగ్గారెడ్డి

-

తన జీవితం ముత్యాలముగ్గు సినిమా హీరోయిన్ మాదిరి తయారైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్​లో పలు అంశాలపై ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు అయ్యాక తమ పార్టీ నేతలు ఎవరి నియోజకవర్గాల్లో వారు పాదయాత్ర చేస్తారని స్పష్టం చేశారు. ఇతర నియోజకవర్గాల నేతలు పిలిస్తే.. వారి నియోజకవర్గంలో కూడా పాదయాత్ర చేస్తామని అన్నారు.

తీవ్రవాద విధానాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. దేశ ప్రజల భద్రత కోసం తీసుకున్న నిర్ణయాల కారణంగానే.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ బలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. నక్సలైట్లు ప్రజల కోసం చేసే పోరాటం చూసి.. జనజీవనంలో కలవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు జరిపినట్లు వెల్లడించారు. వారిని ప్రజల్లో కలిసే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

చట్ట పరిధిలో ఉద్యమాలు చేయకపోవడం వల్లే.. నక్సలైట్లు అడవుల్లో ఉంటూ సమస్యలు ఎదుర్కొనాల్సి వచ్చిందని జగ్గారెడ్డి అన్నారు. రాజకీయ నాయకులు, నక్సలైట్లు కూడా ప్రజల మంచి కోసమే పోరాడుతున్నారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు చట్టసభల పరిధిలో పని చేస్తుండగా.. నక్సలైట్లు చట్టం పరిధి దాటి పని చేస్తున్నారని తెలిపారు. అందువల్లే సమాజానికి దూరంగా ఉండాల్సి వస్తుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news