రైతు వేదికల మంజూరులో ఎమ్మెల్యే రాజకీయం..భగ్గుమంటున్న ప్రతిపక్షం…!

-

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో రైతు వేదికల విషయంలో టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద రచ్చే నడుస్తోందట. ప్రతిపక్ష పార్టీల సర్పంచులు ఉన్నచోట మంజూరైన రైతు వేదికలను, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ రాజకీయం చేసి తమ పార్టీ సర్పంచులున్న చోటుకి మార్పించారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయట. డిండి మండలంలో వ్యవసాయ అధికారులు నిర్ణయించిన క్లష్టర్ గ్రామం కందుకూరు. ఇక్కడ మంజూరైన రైతు వేదికను, ఆ తరువాత శాంతిగూడెం గ్రామానికి మార్చారట. దీన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో దీక్షలు,నిరసనలు చేపట్టారు.

చింతపల్లి మండలంలో నెల్వలపల్లి క్లష్టర్ పరిధిలోని వెంకటంపేట గ్రామానికి మంజూరైన రైతు వేదికను, చివరి నిమిషంలో నెల్వలపల్లికి మార్చారట, దీనిపై సర్పంచ్, గ్రామస్థులు కలిసి కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారులను కలిసి విన్నవించినా, ఫలితం లేకుండా పోయిందట. ఇదే మండలంలోని మరో క్లష్టర్ గ్రామం గొడకొండ్ల పరిధిలోని మదనాపురo గ్రామానికి మంజూరైన రైతువేదిక, క్లష్టర్ పరిధిలోని మిగతా గ్రామాలకు దూరంగా ఉందని,అక్కడ ఎలాంటి వసతులు లేవని, రైతులకు ఇబ్బందులు కలుగుతాయంటూ కొందరు సర్పంచులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు..

కందుకూరులో బీజేపీ, వెంకటంపేటలో కాంగ్రెస్ సర్పంచులు ఉండడంవల్లే అక్కడకి మంజూరైన రైతు వేదికలను టిఆరేస్ పార్టీకి చెందిన సర్పంచులు ఉన్న శాంతిగూడెం, నెల్వలపల్లికి మార్చారనే టాక్ నడుస్తోంది. బీజేపీ మరో అడుగు ముందుకేసి రైతు వేదికల్లో ఎమ్మెల్యే తీరును వ్యతిరేకిస్తూ,నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. అయితే, ఈ ఆరోపణలు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కొట్టిపారేస్తున్నారు. క్లష్టర్ పరిధిలో ఎవరైనా భూమి, నిర్మాణానికి ఎవరైనా విరాళం అందజేస్తే అక్కడే రైతు వేదికలు నిర్మించవచ్చని ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఉందంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news