బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకి ఇవ్వడానికి ముఖ్యమంత్రి సీడీలను మీడియాకు ఇవ్వడమే కారణమని చెబుతున్నారని.. ఇది దర్యాప్తులో ఎలా జోక్యమవుతుందో చెప్పలేదని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తదితరులు దాఖలు చేసిన అప్పీళ్లపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్‌భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు కొనసాగిస్తూ.. కేవలం ఏసీపీ.. సీఎంకు సీడీలు ఇచ్చి ఉంటారన్న భావన తప్ప మరో కారణంలేదన్నారు. సీడీలను మీడియాకు ఇవ్వడం రాజకీయాల్లో భాగమేనని పేర్కొన్న సింగిల్ జడ్జి దాన్నే కారణంగా చూపి నిందితుల హక్కులకు భంగం కలుగుతుందని ఆందోళన చెందడం సరికాదన్నారు. దర్యాప్తు చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, వలపన్ని నిందితులను పట్టుకోవడం, ఎఫ్‌ఐఆర్ నమోదు అంతా వాస్తవమేనని, దాన్నెవరూ ప్రశ్నించలేదని పేర్కొన్నారు.