ప్రగతి భవన్ నుంచి పలువురికి పిలుపు.. కొలిచ్చి వచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలు.

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు తుది అంకానికి చేరుకుంది. ఉదయం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లపై కసరత్తు చేశారు. ఎవరికి లక్కు వరిస్తుందో అని ఉదయం నుంచి పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠత నెలకొంది. తాజాగా కొంత మందికి ప్రగతి భవన్ కు రావాల్సిందిగా సమాచారం వచ్చిందని తెలిసింది. వీరిలో గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎం.సీ కోటిరెడ్డి, పాడి కౌశిక్ రెడ్ది, తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, కడియం శ్రీహరి, ఆకుల లలితలకు పిలుపు వచ్చింది.

తాజాగా సిద్దిపేట కలెక్టర్ గా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. వెంటనే ప్రభుత్వం కూడా రాజీనామాను ఆమోదించింది. ప్రస్తుతం వెంకట్రామిరెడ్డికి కూడా ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. తాను టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు కూడా వెంకట్రామి రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా ఈయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి వస్తుందనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా 6 ఎమ్మెల్సీ సీట్లకు గానూ ప్రస్తుతం 7 గురికి పిలుపు వచ్చింది. అయితే ముందు నుంచి ఎమ్మెల్సీ స్థానాల్లో పేరు వినిపిస్తున్న మధుసూదనాచారికి పిలుపు రాకపోవడం గమనార్హం