ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తోన్న మంకీపాక్స్ ఇప్పుడు తెలంగాణలోని కామారెడ్డి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కామారెడ్డి జిల్లాలో మంకీ పాక్స్ కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన 40 ఏండ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉండడంతో, అతన్ని హైదరాబాద్‌లోని ఫీవర్ హాస్పిటల్‌కు తరలిస్తున్నామని.. ఈ వ్యక్తి జులై 6వ తేదీన కువైట్ నుంచి వచ్చారు.
20వ తేదీన అతనికి జ్వరం, 23వ తేదీ నాటికి రాషెస్ రావడంతో మరుసటి రోజు ఉదయం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లాడని తెలిపింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. అక్కడి డాక్టర్ మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించి కామారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు.
అక్కడ్నుంచి 108లో అతన్ని ఫీవర్ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేస్తున్నాం. ఇక్కడ సాంపిల్ సేకరించి, పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తాం. అంతవరకు ఫీవర్ హాస్పిటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచి ట్రీట్‌మెంట్ అందజేస్తాం. ఈ వ్యక్తితో నేరుగా కాంటాక్ట్ అయిన ఆరుగురిని గుర్తించాం. వాళ్లెవరికీ సింప్టమ్స్ లేవు. అయినప్పటికీ వారిని ఐసోలేట్ చేశామని పేర్కొంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. ప్రజలు మంకీపాక్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ప్రాణాంతక వ్యాధి కాదని చెప్పింది.