చైనాలోని వుహాన్ అనే ప్రాంతంలో ఒకే ఒక్కడికి సోకిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని శాసి స్తోంది. అణ్వాయుధ సంపత్తితో తమకు తిరుగులేదని ప్రకటించిన అమెరికా వంటి దేశాలను కూడా గడగడలాడిస్తోంది. వారు వీరు అనే తేడా లేకుండా అందరినీ కబళిస్తోంది. అయితే, కరోనా విషయంలో అందరూ ఆదిలో చాలా లైట్‌గా తీసుకున్నారు. సాధారణంగా వచ్చే వైరస్‌లాంటిదేనని, ఇది పెద్ద ప్రమాదకరం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా లైట్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే దేశంలో లాక్‌డౌన్ విధించాలన్న ప్రతిపాదనను ఆదిలో ఆయన నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.
ఫలితంగా నేడు ప్రపంచంలోనే కరోనా మరణాల రేటులో అమెరికా అణ్వాయుధం కన్నా వేగంగా దూసుకు పోతోంది. ఇక, కరోనా విషయానికి వస్తే.. దీనికి మందు ఇప్పటికైతే లేదు. ఈ ఏడాది చివరి నాటికి టీకా కనుకొంటామని ప్రపంచ దేశాలు చెబుతున్నాయి. అయితే, అప్పటి లోపు ఎంత మంది చనిపోతారో ఇప్పటికీ లెక్కలు అందడం లేదు. రోజు రోజుకు కరోనా కొత్తరూపం సంతరించుకుంటూనే ఉంటోంది. దీంతో కరోనా కథపై ఇప్పటికే అనే క అధ్యయనాలుసాగాయి. మొదట్లో ఇది 60 ఏళ్లు పైబడిన వారికే సోకుతుందని, వారికే ప్రమాదమని చెప్పుకొచ్చారు. తర్వాత తర్వాత ఇది అందరికీ సోకుతుందని అన్నారు.
ఇక, మహిళలు ఈ వైరస్ సోకే అవకాశం లేదన్నారు. అయితే, అది కూడా తప్పని తర్వాత మరణాలను చూశాక అందరికీ అర్ధమైంది. ఇలా అనేక విషయాల్లో కరోనా ప్రపంచాన్ని బోల్తా కొట్టించింది. ఇక, మరికొన్ని విషయాలను గమనిస్తే.. కరోనా గాలిలో నిలవలేదని, ఉన్నచోట నుంచి కదలలేదనికూడా శాస్త్రవేత్తలు ఆదిలో చెప్పుకొచ్చారు. కానీ, తాజా అధ్యయనాల్లో కరోనా గాలిలో 2 మీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుందని తెలిసింది. అంతేకాదు, మనిషిని మించిన ఎత్తులో అంటే దాదాపు 8 అడుగుల ఎత్తు వరకు అది ఎగరగలదని కూడా అధ్యయన కర్తలు సంచలన విషయాన్ని వెల్లడించారు.
ఇవన్నీ ఇలా ఉంటే.. మనిషి చేతులు, తుమ్ముల, దగ్గు ద్వారానే వైరస్ వ్యాపిస్తుందని ఇప్పటి వరకు భావించిన వారికి మరో దిమ్మతిరిగే వాస్తవం వెలుగు చూసింది. అది కరోనా సోకిన వ్యక్తి మలం నుంచి కూడా వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. ఇది మరీ డేంజర్ అని అంటున్నారు పరిశోధకులు. సో.. మొత్తానికి కరోనా కథలు రోజుకొక విధంగా సంచలనాలు సృష్టిస్తున్నా..ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను మాత్రం హడలగొడుతున్నాయి.