భారతీయ రైల్వే కథ
భోజనం అన్నది మిగుల్చుకోవాలి
దుఃఖం అన్నది దాచుకోవాలి
దాచుకున్నది విలువ
పంచుకున్నది అంతకుమించినదేదో అయి ఉండాలి
బండి ఆగిపోయిన ప్రతిసారీ ఎవ్వరో గుర్తుకు వస్తారు
బండి ఆగి సాగిన ప్రతిసారీ ఎవ్వరో కృతజ్ఞతకు అర్హత సాధించి ఉంటారు
ఈ కథ అలాంటిది..నేను పునః కథనం చేస్తున్నాను అని చెబుతున్నాను
నో మెథడ్ ఓన్లీ మోటివ్
ఇంటికీ పనికీ మధ్య కొన్ని అంతరాలు ఉంటాయి.. బండికీ బండికీ మధ్య కూడా కాలాంతరాలు ఉంటాయి.. కాలాంతరాన్ని ఇంగ్లీషోడు టైమ్ ఇంట్రవెల్ అని అనమన్నాడు..ఆ విధంగా అనడంలో ఔన్నత్యం ఉందో..ఔచిత్యం ఉందో అన్నది నా సిసలు సందిగ్ధత..బాధ్యత తెలిసినప్పుడు మాత్రమే ఏ పదం ఎలా వాడాలో నేర్పాలి..లేదా నేర్చుకోవాలి..ఇప్పుడు బండి ఎక్కడ ఆగింది.. పట్టాలపై బండి.. ఆలస్యంగా బండి..వేగంగా లేని బండి.. నెమ్మదిగా బండి.. భారతీయ రైల్వే బండి.. ఇంకా సేవలకు ఇంకా నమ్మకాలకూ ప్రతినిధి ఈ బండి..ఎలా అన్నది చెబుతున్నాను చదువుండ్రి..
ఇంటి నుంచి భోజనం రాలేదు అన్నదో సంశయం..ఇంటికే సరిగా రాలేకపోయాం అన్నది అన్నది ఓ సందిగ్ధం.. భోజనం ఎలా అయినా వస్తుంది..బండి మాత్రమే వేళకు వెళ్లాలి..బండికీ,బతుక్కీ మధ్య ఎవ్వరో ఓ సమన్వయకర్తగా ఉంటే మేలు..ఆమె పేరు నాజియా పూర్తి పేరు నాజియా తబ్బుసమ్..స్వస్థలం ఉత్తరప్రదేశ్ గాజీపూర్ ..పరీక్ష రాయాలి.. టీచరు కావాలి అన్నది ఆమె సంకల్పం.అన్నది సాక్షి పత్రిక అందించిన వివరం కూడా..
వారణాసి చేరుకోవాలి..పరీక్ష అక్కడ కనుక అక్కడికే చేరుకోవాలి..బండి మాత్రం వేగంగా లేదు..మంచు తెరల కారణంగా ఆగి,ఆగి సాగుతోంది..ఏమయినా టీచరు పరీక్ష..అది..టీచరు కావాలన్న వారికి తప్పనిసరి పరీక్ష అది.పరీక్ష ఏదయినా సాధించి తనని తాను నిరూపించుకోవాలన్న తపన నాజియాది..కానీ కాలం పరీక్ష వేరు..రైలు పెట్టిన పరీక్ష వేరు..ప్రకృతి నిర్వహించిన పరీక్ష వేరు విధించిన షరతు వేరు..నాజియా బండి ఆగిపోయింది.మనం ఇండియన్ రైల్వేను తిట్టాలి..మనం భారతీయ రైల్వే వ్యవస్థకు సంబంధించిన సమయాలను తిట్టాలి..వేళా పాళా లేని ఈ బండి ఎందుకు మనంఎక్కాలి.. ఈ తిట్టులో నియమం ఉండకూడదు.. నిజాయితీ ఉండాలి..ఏ తిట్టులో అయినా నియమం కన్నా నిజాయితే గ్రాహక పదార్థం కావాలి..వస్తువు ఏమయినా దాని విలువ నిర్ణయం సకాలంలో ఉత్పత్తికి నోచుకున్నప్పుడే..! కానీ కాలం కాని కాలంలో ఆమె పరీక్ష హాలుకు చేరుకుంటే ఎలా?
రైలు వారణాసి కి చాలా దూరంలో ఆగిపోయింది మౌ జంక్షన్ లో ఆగిపోయింది..ఆ..ఆగిపోవడంతో కొన్ని జీవితాలలో ఆందోళనలు బయలుదేరాయి..నాజియా పరీక్షకు పోవాలి..నాజియాతో పాటూ ఇంకొందరు గమ్యానికి చేరుకోవాలి.. ఇలాంటివి కొన్ని వీటిని దాటి బండి పోవాలి.. పోదు.. నాజియా తో పాటూ ఆమె తమ్ముడు.. నాజియాతో పాటు ఇంకొందరు..
ఇండియన్ రైల్వేస్ ను తిట్టండి.. బండిని తిట్టండి..కానీ సేవలను తిట్టకండి..సకాలంలో అందే సేవలు గుర్తించి ఆ..తిట్టును ఆపుకోండి..సకాలంలో గమ్యానికి చేరుకునేలా రైల్వే శాఖ పనిచేసింది ఆ రోజు..కేవలం నాజియా తమ్ముడి ట్వీట్ తో..ఒకే ఒక్క ట్వీట్ తో..ఇప్పుడు చెప్పండి నాజియా తిట్టులో నిజాయితీ ఉందా లేదా? ఆ మాటకు వస్తే భారతీయుల తిట్టులోనో ఆందోళనలోనో నిజాయితీగానే ఉంటారు కానీ ఆ నిజాయితీ వీలున్నంత వేగంగా గుర్తింపునకు నోచుకోదు..
వేళ కాని వేళలు..కనీస శుభ్రతకు నోచుకోని శౌచాలయాలు ఉన్న భారతీయ రైల్వే అప్పుడప్పుడూ అయినా మంచి పనులు చేస్తుంది.లేదా చేసేందుకు తన శక్తిని సమీకరిస్తుంది.అప్పుడయినా మనం అభినందించాలి.ఆడిపోసుకోరాదు.ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఒక గొప్ప బాధ్యతను నిర్వర్తించిన వేళ ఆనందించాలి..నాలానే మీరూ వారికి వందనాలు చెల్లించండి..అన్ని రైళ్లూ కాలం పెట్టిన పరీక్షను దాటుకుని గమ్యాలకు చేరుకుంటే మేలు..నాజియా అను దీదీకి వందనాలు చెల్లించండి..ఇంతటి కథనానికి కేంద్ర బిందువు అయినందుకు.. ఈ మార్నింగ్ రాగా ఇంతటితో సమాప్తి.
– రత్నకిశోర్ శంభుమహంతి