నేలకు ఇంతటి చరిత్రాత్మకం
అయిన సందర్భం లేదు
చరిత్రకు ఇంతటి దుర్భరం
అయిన రోజు లేదు
ఉండదు రోజు ఉన్నా అది
ఇలాంటి నిర్మాణ శకలాలను
పోగేసుకుని ఉంటుందా
శవాలను ఇప్పటికే లెక్కించనూ లేదు
వానలేవో ఆ పని చేయనీయడం లేదు
ఎండ పొడ గిట్టడం లేదు
ఇవి అనుసరించే విలయాలు
ప్రాసంగికం అయిన సంఘీభావాలు
ఇన్ని వేల మంది చావులను
దేశాలు తమ దురవస్థ అని ఎందుకు ఒప్పుకోవడం లేదు
ఏమో రాజీనామా పత్రం ఒకటి
అందిస్తే మేం అంతా చావును జయిస్తామా..
ప్రియ దేశాధినేతలను ప్రశ్నింపగ రావాల..
నిత్యమయిన దుఃఖం
అవును పాపం
నిత్యం అయిన సుఖం
కాదు ఒక పుణ్యం
అవున్రా! దేహాలన్నీ ఖండితాలు
ఖండిత ప్రావస్థలకు ఆనవాళ్లు
ఉదయం వాన చిలకరించి పోయింది
మేఘార్ణవాన సుఖం దాగి ఉండును
నగ్న దేహ ఛాయల్లో సుఖాలు
నగ్నత్వం పోగేసుకున్న రాత్రులు
ఇచ్చినవి ఏమయి ఉంటాయి
అవి కన్నీళ్లు
కన్నీటి తో అభిషక్తం అయిన శిలలకూ
శిఖరాలకూ శిఖరాగ్ర స్థానాలకూ
ఒక విలువ వెతికి తేవాలి
లేదా చరితకు చోటు ఇవ్వాలి
పేజీలు ఒకటో తారీఖు పేజీలు
జీవితాలే అథమాథమ స్థానాలు
కేవలం అభిషక్తం అయిన వాన
నాపై అలాంటి వాన
ఒకటో తారీఖు వాన
మృత్యు శిఖరాలు
అనంతాలను
అందిస్తూ
తమ అంచులను తాకమని
ఉద్బోధిస్తున్నాయి
ధైర్యం అన్నది ఒక కొన
ఊపిరి నాలుగు దిక్కులకు పోయిన చాలు
అన్నింటా అది అభిసరణ
జీవితంలో దుఃఖ పీడితాలు
దుఃఖం నుంచి విరుగుడు కోరిన సందర్భాలు
ఎన్ని వెతికితే అంత మేలు
భయాన్ని పీడన సంబంధాన్నీ
వదిలి రావడం ఇప్పటి కాలానికి
సాధ్యం కావడం లేదు
మృత్యువు అమృత్యవు
అన్నవి ఉన్నాయా
తెలియదు జీవన్మరణ శిఖ ఒకటి
నిర్మితం అయి ఉంది లోపల
ఆ శిఖరం విరిగిన చాలు
ఆనందాలకు కొదవ ఉండదు
కానీ ఇప్పట్లో అది సాధ్యమా?
అండ్ ద టైటిల్ ఈజ్
మార్నింగ్ రాగా : ఒకటో తారీఖు వాన
– రత్నకిశోర్ శంభుమహంతి