రాత్రిని నిషిద్ధం చేయమన్నాను
యథాలాపం..ఈ విలాపం అని కూడా..
నిర్థారించమన్నాను
రహస్యోద్యమ స్ఫూర్తి ఉందని చదివేను
లిపి రహస్యం అవుతుందా లేదా స్వప్నం రహస్యం అవుతుందా
వెతికే కొద్దీ ఏదో ఒకటి జీవన యాంత్రికతలో రహస్యమే
ప్రశ్న వెల్లడి ఊహ వెల్లడి .. ఊహాపాతం వెల్లడి
కానీ అంతేలేని రాత్రికి అర్థవంతం కాదని విన్నాను చదివేను
చావును పరిష్కర్త గా చూపాడు ఒకరు రు కాదు డు
చావులే లేని లోకం లేదని తేలాక చావే అంతిమ పరిష్కర్త
అని తేల్చాను..
ఊహ రసోద్యమం కలలో ఉత్పాతాలో తేలని చోట
ఉద్యమ ఫలితం ఎలా అందుకోగలం
విహీనత ఉన్నంత వరకూ విద్వత్ కు చోటుందని అనుకోను
కళ విహీనత కల కూడా.. అదే కోవ….
బహిష్కృత దేహం బహిష్కృత రాత్రి అపరిష్కృత కల
వాస్తవంలో లేని జీవితం అబద్ధపు కాలం నిజాలను దాపెట్టే నైజం
ఇప్పటి నుంచి ఎప్పటిదాకా???
వెలుగు ఈ కవిత్వం ఇస్తుందని తెస్తుందని అలాంటి అనగా మాలిన్య రహిత వెలుగు అని చెబుతున్నాను.. అప్పుడు మాత్రమే మానవుడి జీవితాలకు ఈ కవులు మద్దతుగా నిలిచి కొంతకాలం అయినా ఊరడింపుగా అయినా వినసొంపుగా తోచిన అబద్ధాలను ఆర్తనాదాల మాటున చాటి చెబుతారని ఒక విశ్వాసంగా నిలిచిపోయింది ఆ స్వప్నలిపిని చదువుతుంటే.. అలాంటి కారణం ఇవాళ్టి వేళ సవిస్తారం. అలాంటి దుఃఖం ఈ ఉప్పునీటి సవ్వళ్లకు కొద్దిగా ఆధారం. గుడ్డి గానం గురించి విన్నాను..గుడ్డి దీపాల చెంత వాటి గేలాలు దేనికో అని ఆరా తీస్తున్నాను. కాలం ఒకటి ముందున్న వాటిని చెరిపేసి, విస్మయాలను ముష్టిగా వేస్తుంది. దీనిని ఆర్తిపరంగా భిక్ష అని సర్దుకుపోయి, వీధుల వెంబడి పరుగులు తీసిన రోజులను ఒకరు ఇలా రాస్తున్నారు. వారి పేరు అజంతా.. స్వప్నలిపి రూపకర్త..
– రత్నకిశోర్ శంభుమహంతి