ఈ నెల (జూన్, 2022) ఆరు నుంచి వానలు..ఆరుగాలం శ్రమించే రైతుకు ఉపశమనం ఇచ్చే వానలు..వానలు, వాన సంబంధిత రాగాలు..మట్టి పరిమణాలు అన్నీ కూడా వస్తున్న కాలాన మేలు చేస్తాయి. ఊళ్లోకి దేవుడు వచ్చే వేళ కూడా అప్పుడేనట ! ట ట ట ! అని రాయకు అని కోపం అయ్యేరు ఓ అయ్యోరు ! మనిషి బంధగత ప్రావస్థలను విచ్ఛిన్నం చేసుకుని ఉన్నాడు కనుక నేలకూ, మనిషికీ వినిమయ సంబంధ వ్యత్యాసాలు అనేకం వినిపిస్తున్నాయి. వినిమయం కాకుండా, నేలకూ మనిషికీ ఓ బంధం అపూర్వం అయి ఉంది అని గుర్తిస్తే అప్పుడు వానలు మరియు చెట్లూ, చేమలూ మేలు చేస్తాయి. నేలను వినియోగించి మనిషి, మనిషి వినియోగంలో లేని ప్రకృతి వీటి భేదాలను గుర్తించేందుకు ముందున్న కాలం ఓ అనుజ్ఞ ఇస్తే చాలు. వస్తున్న కాలాన నేలను పలకరించే వానకూ, పచ్చని పుడమికీ, రైతు కష్టానికీ..సుఖానికీ మధ్య ఏ గీతలూ ఏ రేఖలూ ఏ వక్రగతులూ లేకుండా ఉంటే చాలు. ఆ తరహా అగణితం (అన్ కౌంటబుల్ ఫ్యాక్టర్) ఆనంద రూపాన పరిచయం అయి స్థిరం అయితే మేలు.
పరిమళ సంబంధ గాలులు.. సోయగ సంబంధం అనుకునే పూలు.. నిష్ఫల సంబంధ చర్యలు. వీచే గాలికి , పూచే పూవుకు సాగే సంభాషణాత్మక రాగం ఈ కాలం. విసుగు తెప్పించిన వానలు గత నెలలో వచ్చి పోయాయి. గాలులను నిందించడం అన్నది ఒక తప్పని సరి పని. తప్పు ! అవునో కాదో తెలియదు. ఎండలనూ, వానలనూ సంబంధిత పొడ గిట్టని సమయాలనూ ఒక విధంగా దుఃఖ సంబంధ వెలివేతలనూ మనిషి ఏ విధంగా పొంది ఏవిధంగా అర్థం చేసుకుంటున్నాడో అన్నదే ముఖ్యం. క్యాలెండర్లో పేజీలు తరిగిపోతున్న కొద్దీ సంస్కృతి ఓ దగ్గర, మనిషి ఓ దగ్గర విసిరి వేతల్లో ఉంటాడని అనుకోవాలి. మనిషికి సాయం చేసే కాలాలు వాటి అనువర్తనాలు కూడా కొన్ని అనుదినం జ్ఞాపకాలుగా తోస్తాయి. సాయం చేసిన సమయం జీవితాన హృదయాన నిక్షిప్తం అయి ఉంటాయి. కాలం కొన్ని సార్లే నిష్ఫలంగా తోస్తుంది. కనిపిస్తుంది. నిర్థారితం అవుతుంది. అప్పుడు కూడా ఈ భార సహిత స్థితిని మోయక తప్పదు.
ఒకటో తారీఖు నేర్పేవి..నేర్పనివి కలిస్తే ఒక ఊహ విస్ఫోటనం కావొచ్చు. ఒక కల కొత్త రంగు పులుముకుని తీరొచ్చు. బాధలన్నీ క్షణాల సంకెళ్ల మధ్య ఇరుక్కుపోతాయి. అప్పుడు మాత్రం మనం కావాల్సినంత స్వేచ్ఛ కు కావాల్సిన రీతిలో బానిసలం కావొచ్చు. కావాల్సినంత స్వేచ్ఛ కావాల్సినంత వెలుగు గదిలో.. జీవితంలో ఇంకా హృదిలో ..
వెలుగులు కొన్ని, పువ్వులు కొన్ని పాత కొత్తల జీవితాన ఆవిష్కరణలు కొన్ని.. మనిషి ఒక నిరాశ నుంచి ఒక నిర్వేదం వరకూ ప్రయాణిస్తూ,ప్రయాణిస్తూ అలసిపోవడం ఓ చిన్న పని ! విధిగా తోచిన పని..మనిషి తన బాధలను కాలంతో పోల్చి చూస్తాడు. కాలంతో కొలిచి చూస్తాడు. అటువంటి కాలం దగ్గర మనిషి చిన్నవాడు. లేదా పెద్దవాడు కూడా ! ఈ కాలం ఏంటి ఈ విధంగా ఉంది అని తిట్టుకునే వాడు కూడా ! ఒకటో తారీఖు జీవితాన్ని సుసంపన్నం చేసే రోజు అని అనుకోను కానీ జీవిత కాలాన్ని ఓ ఆరంభం నిర్దేశికగా ఉంటుంది అని భావిస్తాను. ఒకటో తారీఖు జీతం, అప్పుల కొలమానాలకు అతీతంగా ఉండాలని అనుకోవడంతో ఆరంభం. ఆ విధంగా ఉంటే చాలు అనే ఆనందం.. మరొకటి ఇంకొకటి నుంచి కాలం ఇచ్చిన తీర్పు.
వేదం – కాలం ఒక్కటి కావొచ్చు. వేదకాలం అంటే విస్తృతావర్తనంలో మనుగడకు చెందిన కాలం అని రాయాలి. జీవితేచ్ఛను భ్రమ నుంచి వాస్తవం వైపు నడిపిన మనిషి ని చూసి పొంగిపోవాలి. మీ దారుల్లో ఎవరెవరు ఉన్నారు. వారంతా ఉదయపు వేళల్లో గుర్తుకు రావాలి. బాగా రాసిన రోజు, బాగా రాయక ఏడ్చిన రోజు అన్నీ కూడా మన దారుల్లోనే నిక్షిప్తాలు. పెద్ద, పెద్ద బాధలు అన్నీ మనిషి అనే ఓ చిన్న గీత దగ్గర చిన్నబోయినప్పుడు ఒకటో తారీఖు అర్థవంతంగా ఉంటుంది. అర్థవంతం అయిన జీవన క్రమణికకు ఈ కాలం ఒక ఆదేశం ఇస్తుంది. ఆ అనుజ్ఞను పాటించడమే ఇప్పటి కర్తవ్యం. తక్షణ కర్తవ్యం అని రాయాలి.
– రత్నకిశోర్ శంభుమహంతి