రాజకీయాల్లో ఏ నాయకుడైన నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలి. ప్రత్యర్ధులపై ఎడాపెడా విమర్శలు చేయడం వల్ల పావలా ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఏం మాట్లాడినా ప్రజలకు క్లియర్ గా అర్ధమైపోతుంది. కాబట్టి ఏ నాయకుడైన ప్రతి అంశంపై ఆచి తూచి మాట్లాడాల్సి ఉంటుంది. అలా కాకుండా గుడ్డిగా విమర్శలు చేస్తే అదే రివర్స్ అయిపోతుంది.
ఇప్పుడు మోత్కుపల్లి నర్సింహులు విషయంలో అదే జరిగేలా కనిపిస్తోంది. దళిత వర్గానికి చెందిన మోత్కుపల్లి కింది స్థాయి నుంచి ఎదిగిన నాయకుడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. రాజకీయాల్లో అనేక ఎత్తులు పల్లాలు చూశారు. అలాగే ఆయనకు రాజకీయంగా మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ఇదంతా ఒకప్పుడు…ఇప్పుడు రాజకీయాల్లో మోత్కుపల్లి లాంటి వారు అవుట్‌డేటెడ్. సీనియర్ నేతలని గౌరవించుకోవాలి…కానీ వారిని రాజకీయంగా ముందుపెడితే ఫలితం శూన్యం.
ఇప్పుడు సిఎం కేసిఆర్…మోత్కుపల్లిని బాగా హైలైట్ చేసేశారు. ఆయన్ని పార్టీలో చేర్చుకుని, బాగానే పైకి లేపే కార్యక్రమం చేశారు. ఇక మోత్కుపల్లి కూడా ఏం తక్కువ కాదుగా…ప్రపంచంలోనే కేసిఆర్ లాంటి సిఎం లేరని భజన స్టార్ట్ చేసేశారు. మోత్కుపల్లి ఎక్కడ ఉంటే…ఆ పార్టీ అధినేతలకు భజన బాగా చేస్తారనే విషయం తెలిసిందే. కానీ ఆ భజన వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పైగా అవుట్‌డేటెడ్ నేతగా ఉన్న మోత్కుపల్లి వల్ల హుజూరాబాద్‌లో నాలుగు దళిత ఓట్లు టిఆర్‌ఎస్‌కు పడతాయా? అంటే ఆయన మాటలు విని ఓట్లు వేసే రోజులు పోయాయనే చెప్పాలి.
ఇక అలాంటి నాయకుడు….హుజూరాబాద్ ప్రజల్లో ఫాలోయింగ్ ఉన్న ఈటల రాజేందర్‌పై విమర్శలు చేయడం కూడా ప్రజలు పెద్దగా పట్టించుకునేలా లేరు. టిఆర్ఎస్‌లో చేరి ఒకరోజు కూడా కాలేదు…అప్పుడే మోత్కుపల్లి బురదజల్లడం మొదలుపెట్టేశారు. దళితబంధుని ఈటల అడ్డుకున్నారట. అందుకే ఈటలని ప్రజలు అడ్డుకోవాలట. అసలు ఈటలని ఓడించడం కోసమే కేసిఆర్ దళితబంధు తీసుకొచ్చారు. ఎన్నికల కోసమే ఆ కార్యక్రమం మొదలుపెట్టారు. ఎన్నికల కోడ్ రావడంతో బ్రేక్ పడింది. పైగా పథకం పేరిట డబ్బులు పడినవారు వాడుకోకుండా అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. మరి దళితబంధు పేరిట జనాలని మోసం చేసిందే టిఆర్ఎస్. దీని బట్టి చూస్తే మోత్కుపల్లి గుడ్డిగా ఈటలపై విమర్శలు చేస్తే ప్రజలు పట్టించుకొనే పరిస్తితిలో లేరనే చెప్పొచ్చు.