ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ఏపీలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. మోడీ పర్యటనలో పాల్గొంటానని నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు ఏపీకి రాకుండానే వెనక్కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మోదీ పర్యటనలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రఘురామరాజు.. భీమవరం వెళ్లేందుకు గతరాత్రి హైదరాబాద్ నుంచి ఏపీకి బయలు దేరారు. అయితే ఈ నేపథ్యంలో.. రఘురామకు ఓ ఫోన్ వచ్చింది. శనివారం ఆయనకు మద్దతుగా భీమవరంలో ర్యాలీ నిర్వహించిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారిపై కేసులు నమోదు చేశారన్నది ఆ ఫోన్ సారాంశం.
యువకుల తల్లిదండ్రులే ఆ ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపం గురైన రఘురామ కృష్ణంరాజు మధ్యలోనే రైలు దిగి వెళ్లిపోయారు. ప్రొటోకాల్ విషయంలో అధికారులు తనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఈ సందర్భంగా ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. యువకులపై కేసు పెట్టడం రఘురామను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని, అందుకనే ఆయన భీమవరం రాకుండానే రైలు దిగి వెనక్కి వెళ్లిపోయారని ఆయన కార్యాలయం తెలిపింది.