బెంగ‌ళూరుపై ముంబై ఇండియ‌న్స్ ఘ‌న విజయం

అబుధాబిలో బుధ‌వారం జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 48వ మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై ముంబై ఇండియ‌న్స్ ఘ‌న విజ‌యం సాధించింది. బెంగ‌ళూరు ఉంచిన ల‌క్ష్యాన్ని ముంబై సునాయాసంగా ఛేదించింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టుపై ముంబై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

mumbai indians won by 5 wickets against bangalore in ipl 2020 48th match

మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా బెంగ‌ళూరు బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 164 ప‌రుగులు చేసింది. బెంగ‌ళూరు బ్యాట్స్‌మెన్ల‌లో ప‌డిక్క‌ల్‌, జేఆర్ ఫిలిప్పెలు రాణించారు. 45 బంతుల్లోనే 12 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో ప‌డిక్క‌ల్ 74 ప‌రుగులు చేయ‌గా, ఫిలిప్పె 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 33 ప‌రుగులు చేశాడు. ముంబై బౌల‌ర్లలో బుమ్రా 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ట్రెంట్ బౌల్ట్‌, చాహ‌ర్‌, పొల్లార్డ్‌ల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై 19.1 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్ల న‌ష్టానికి 166 ప‌రుగులు చేసింది. ముంబై బ్యాట్స్‌మెన్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ అజేయంగా నిలిచాడు. 43 బంతులు ఆడిన యాద‌వ్ 10 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 79 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇషాన్ కిష‌న్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 25 ప‌రుగులు చేసి ఫ‌ర‌వాలేద‌నిపించాడు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌ల‌కు చెరో 2 వికెట్లు ద‌క్కాయి. క్రిస్ మోరిస్ 1 వికెట్ తీశాడు.