మున్సిపల్ ఎన్నికల్లో పట్టుకోసం ఆ జిల్లాలో టీడీపీ కొత్త వ్యూహం !

-

మున్సిపాలిటీలు కూడా పంచాయతీల్లాగానే వదిలేస్తే తిరిగినప్పుడు పలకరించడానికి కార్యకర్తలు కూడా మిగలరని అనుకున్నారో ఏమో గేర్‌ మార్చి రోడ్డెక్కారు టీడీపీ నాయకులు. పల్లెపోరులో పార్టీతోపాటు తమ పరువు కూడా పోయిందనే భావిస్తున్న నాయకులు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల వేడి రాజుకోవడంతో.. పంచాయతీ ఎన్నికలు మిగిల్చిన ఓటమి నుంచి బయటపడేందుకు అందరు నాయకులు లైన్ లోకి వచ్చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల మధ్య పట్టణాలను కూడా వదిలేస్తే భవిష్యత్‌లో ఇబ్బంది పడతామనే ఆందోళన టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. కంచుకోటగా భావించే విజయనగరం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల మాదిరే పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూడా తెలుగుదేశం పార్టీకి షాక్‌ ఇచ్చాయి. జిల్లాలో 955 గ్రామ పంచాయతీలకు గాను.. 158 చోట్లే టీడీపీ మద్దతుదారులు గెలిచారు. ఇన్నాళ్లూ తమ ఊళ్లు అనుకున్న చోట వైసీపీ జెండాలు రెపరెపలాడాయి.

మున్సిపల్ ఎన్నికల్లో ఇలాగే ఉంటే లాభం లేదనుకున్న నాయకులు రూట్ మార్చారు. ఎక్కడి వాళ్లు అక్కడి దిగిపోయారు. జిల్లా టీడీపీ నేతలే కాకుండా.. ఈ జిల్లాలో వివిధ ప్రాంతాలకు ఇంఛార్జులుగా ఉన్న ఇతర ప్రాంతాల నాయకులు సైతం కాలికి బలపం కట్టుకున్నట్టు పర్యటనలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నాం కదా.. బరువో భారమో అనుకుని అంతా లైన్‌లోకి వచ్చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బొబ్బిలిలో బేబినాయన కాస్త శ్రద్ధ తీసుకోవడంతో అక్కడ టీడీపీకి మెరుగైన ఫలితాలు వచ్చాయి. అలా జిల్లాలో పట్టించుకున్నవాళ్లకు పట్టించుకున్నట్టుగానే ఫలితాలు ఊరట నిచ్చాయి. ఆ ఎఫెక్ట్‌తో పాత నాయకులంతా టౌన్లపై ఫోకస్‌ పెట్టారు. ముందుగా పోటీలో ఉన్న టీడీపీ కౌన్సిలర్లు.. కార్పొరేటర్‌ అభ్యర్థులకు ధైర్యం చెప్పడం.. అధికారపార్టీ నుంచి వచ్చే ఒత్తిళ్లకు లొంగకుండా కాపు కాయడం.. ఎన్నికలు ఏకపక్షంగా సాగకుండా అండగా ఉండటం చేస్తున్నారట.

పోటీలో ఉన్నవారిని ఫైట్‌ చేసే విధంగా ఒప్పించడానికి కిందా మీదా పడుతున్నారు నాయకులు. గెలిచేందుకు అవకాశం ఉన్నచోట.. కేడర్‌ బలంగా ఉన్న ప్రాంతాల్లో వాలిపోయి గెడ్డాలు, కాళ్లు, చేతులు పట్టుకుని బతిమాలే పరిస్థితి ఉందని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మున్సిపాలిటీలలో గత ఎన్నికల్లో టీడీపీనే గెలిచింది. ఈసారి వాటిని కాపాడుకోవడం కంటే.. పోటీలో ఉన్న అభ్యర్థులు జారిపోకుండా కాపుకాయడమే స్థానిక టీడీపీ నేతలకు సవాల్‌గా మారింది. విజయనగరంలో అదితి గజపతిరాజు, బొబ్బిలిలో బేబినాయన రంగంలోకి దిగి ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల ఇంఛార్జ్‌గా ఉన్న కూన రవి కుమార్‌, బుద్దా వెంకన్న, కిమిడి నాగార్జున, గణబాబులు వీరితో జత కలుస్తున్నారు.

విజయనగరంలో అదితి గజపతిరాజుకు తోడుగా ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్సీ జగదీష్‌ ప్రత్యేక బాధ్యతలు తీసుకుని పని చేస్తున్నారు. బొబ్బిలిలో బేబి నాయనతోపాటు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇలా సాలూరు, నెల్లిమర్లలోనూ టీడీపీ నేతలు ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు రోడ్లపైనే ఉండి ప్రచారంలో కనిపిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కనిపించిన ఈ ఎఫెర్ట్‌.. మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీకి ఏ మేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news