రాష్ట్రంలో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక మేనియా నడుస్తోంది. అయితే.. రేపటితో మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. రేపు సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగుస్తుందని వెల్లడించారు. అంతేకాకుండా.. నవంబర్ 3వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. మునుగోడులో 2,41,000 ఓటర్లు ఉన్నారని, 298 పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయని, అర్బన్ పోలింగ్ 35 రూరల్ 263 ఉన్నాయన్నారు. కొత్త ఓటర్ కార్డులు ఇచ్చామని, అన్ని పోలింగ్ స్టేషన్ లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. అయితే.. 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్న ఆయన.. మునుగోడులో ఓటు హక్కు లేని వాళ్ళు ప్రచార సమయం ముగిసిన తరువాత మునుగోడులో ఉండకూడదని స్పష్టం చేశారు.
మునుగోడులో మొత్తం 185 కేసులు నమోదు అయ్యాయని, 6.80కోట్ల క్యాష్ సీజ్ అయ్యిందని, 4,683 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు. రాజకీయ పార్టీల నాయకులు అన్ని కలిపి 479 ఫిర్యాదులు చేసాయన్నారు. సోషల్ మీడియాలో కూడా రేపు సాయంత్రం 6 గంటల నుండి ఎన్నికల ప్రచారం చేయకూడదని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ప్రచారానికి ఇంకా ఒక రోజే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. మునుగోడు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీలు గుప్పిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు నాయకులు శక్తికి మించి శ్రమిస్తున్నారు.