సొంత పౌరులపై మయన్మార్ సైన్యం బాంబు దాడులు.. 100 మంది మృతి

-

మయన్మార్ సైన్యం దురాగతాలకు అడ్డుకట్ట లేకుండా పోతోంది. సొంత పౌరులపైనే తమ దాష్టీకాన్ని చూపిస్తోంది ఈ సైన్యం. తాజాగా మయన్మార్ మిలిటరీ ఓ గ్రామంపై జరిపిన వైమానిక దాడుల్లో వంద మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

కాన్​బలు పట్టణానికి సమీపంలో ఉన్న పాజిగ్యీ గ్రామ శివారులో సైనిక పాలనను వ్యతిరేకిస్తూ ఓ కార్యక్రమం జరిగిందని ప్రజాస్వామ్య అనుకూల వర్గానికి చెందిన ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. ఉదయం 8 గంటల సమయంలో పెద్ద సంఖ్యలో స్థానికులు ఈ సమావేశానికి హాజరయ్యారని తెలిపారు. సైనిక పాలనను వ్యతిరేకించే బృందాలు కొత్తగా ఏర్పాటు చేసిన కార్యాలయ ప్రారంభోత్సవానికి వీరంతా వచ్చారని వివరించారు.

ఈ నేపథ్యంలోనే ఓ యుద్ధ విమానం.. జనంపై బాంబులు జారవిడిచిందని తెలిపారు. అరగంట తర్వాత ఓ హెలికాప్టర్ వచ్చి ఇదే ప్రాంతంలో కాల్పులు జరిపిందని వివరించారు. మొదట 50 మంది మరణించినట్లు వార్తలు రాగా.. మృతుల సంఖ్య కొద్దిసేపట్లోనే 100కు చేరుకుందని స్వతంత్ర మీడియా వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news