తాజాగా ఓ వర్గం మీడియాలో వస్తున్న వార్తలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. అధికార వైఎస్సార్ సీపీ.. టీడీపీకి చెందిన నాయకులను టార్గెట్ చేసిందని, వారిని వేధిస్తోందని, పార్టీ మారాలనే ఒత్తిడి చేస్తోందని, పార్టీ మారేందుకుఇష్టపడని వారిపై కత్తి కట్టిందని, కేసులు పెడుతోందని, వారి వ్యాపారాలను కూడానిలుపుదల చేస్తోందని ఇలా ఓ వర్గం మీడియా పుంఖాను పుంఖాలుగా వార్తలు రాస్తోంది. మరి దీనిలో నిజం ఎంత? అసలు ఇప్పుడున్న నేతలకే పదవులు ఇవ్వలేని పరిస్థితిలో, వారిని సంతృప్తి పరచలేని పరిస్థితిలో ఉన్న జగన్ పార్టీకి టీడీపీ నేతల అవసరం ఉందా? అనే సందేహాలు వస్తున్నాయి.
విషయంలోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి వరుస విజయాలు సాధిస్తున్న గొట్టిపాటి రవి.. కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావులు.. టీడీపీలో ఉన్నారు. వీరిద్దరినీ వైఎస్సార్ సీపీ తన గొడుగు కిందకు రావాలనే ఒత్తిడి చేస్తోందని, అయితేవారు రావడం లేదని అందుకే వారికి చెందిన మైనింగ్ వ్యాపారాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించిందని వార్తలు వస్తున్నాయి. నిజానికి గొట్టిపాటి రవి వైఎస్సార్ సీపీ నుంచే టీడీపీలోకి జంప్ చేశారు. ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకునే అవకాశం, అవసరం నిజానికి ఆ పార్టీకి లేదు. అయినప్పటికీ.. టీడీపీ అనుకూల మీడియా మాత్రం ప్రభుత్వం వేధిస్తోందని చెబుతోంది.
ఇక, పోతుల రామారావు.. టీడీపీలోనే పరాజిత నేత. ఆయనకు పెద్ద హవా లేదు. అలాంటి నాయకుడిని పార్టీలో చేర్చుకునేందుకు వైఎస్సార్ సీపీ ఎందుకు ప్రయత్నిస్తుంది ? పైగా కందుకూరులో వైఎస్సార్‌సీపీకి మహీధర్‌రెడ్డి బలమైన నేతగా ఉన్నారు. అయితే, వ్యాపార పరంగా వారు చేస్తున్న అక్రమాలపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తుండడంతో ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా టీడీపీ అనుకూల మీడియా ఇలా దుష్ప్రచారం చేస్తోందనే వాదన ఉంది. మైనింగ్ వ్యాపారం చేస్తున్న ఈ నాయకులు కొన్ని అక్రమాలకు పాల్పడ్డారనే విషయంపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. పోనీ.. అంతగా ప్రభుత్వం తమను వేధిస్తే.. న్యాయస్థానాలు ఏమయ్యాయి?