పట్టాభి లాంటి ప్రజా ప్రతినిధులపై దాడిని ఖండిస్తున్నామన్నారు జనసేతన నేత, నటుడు నాగబాబు. తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. వైసీపీకి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వ్యక్తిగత ప్రతీకారం కోసం ఎలా వాడుకుంటున్నారో చెప్పడానికి టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిపై జరిగిన దాడి నిదర్శనమన్నారు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారని ముఖానికి టవల్ చుట్టి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారని ఆయన ఆవేదన వింటుంటే ఆశ్చర్యం అనిపిస్తోందన్నారు నాగబాబు. కరుడుగట్టిన నేరస్థులతో విచ్చలవిడిగా పట్టాభి లాంటి ప్రజా ప్రతినిధులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య పద్ధతికి పూర్తి విరుద్ధమని నాగబాబు ఫైర్ అయ్యారు.
అయితే.. ఏపీలో గన్నవరం సీఐపై హత్యాయత్నం చేశారనే అభియోగాలపై.. తెలుగుదేశం నేత కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు గన్నవరం అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేశారని ఆయన ఫిర్యాదు చేశారు. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దాడి జరిగిందని తెలిసి అక్కడకు వెళ్తుండగా.. పోలీసులు గాంధీ బొమ్మ వద్దే తనను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. తన వాహనంలోనే హనుమాన్ జంక్షన్ మీదుగా గుడివాడ తీసుకెళ్లారు. అక్కడ పొలిమేరల్లో పోలీసు వాహనంలోకి ఎక్కించారని చెప్పారు. ఆ తర్వాత తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని అన్నారు. స్టేషన్‌లోకి వెళ్లాక కరెంటు పోయిందని పేర్కొన్నారు.