తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికారపక్షంపై తీవ్ర విమర్శలు చేస్తూ.. మండిపడుతున్నారు ప్రతిపక్ష నేతలు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయమై సీఎం జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా.. జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు కూడా స్పందించారు. ’60 సంవత్సరాల చరిత్ర కలిగిన అంతర్వేది రథాన్ని కావాలని తగలబెట్టారా? ఇంకేమైనా కారణాలున్నాయా? నిగ్గు తేల్చాల్సిన బాధ్యత వైసీపీపై ఉంది.
ఇది మతానికి సంబంధించిన విషయం. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే హిందు వ్యతిరేక ముద్ర పడటం గ్యారంటీ. వైసీపీ ప్రభుత్వం జాగ్రత్త పడాలి” అని నాగబాబు ట్వీట్ చేశారు. కాగా, ఆలయ ప్రాంగణంలోని భారీ రథం శనివారం రాత్రి అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. షెడ్డులో ఉన్న రథానికి మంటలు అంటుకొని ఒక్కసారిగా ఎగిసిపడటంతో రథం పూర్తిగా కాలి బూడిదైంది. 40 అడుగుల ఎత్తున్న ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం పూర్తి టేకు కలపతో తయారు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
60 సంవత్సరాల చరిత్ర కలిగిన అంతర్వేది రథాన్ని కావాలని తగలబెట్టారా,ఇంకేమైనా ఇతర కారణలున్నాయా నిగ్గు తేల్చాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వం పై ఉంది.ఇది మతానికి సంబంధించిన విషయం.దోషులు శిక్షింపబడాలి.ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే హిందు వ్యతిరేక ముద్ర పడటం గారంటీ.వైసీపీ govt జాగ్రత్త పడాలి
— Naga Babu Konidela (@NagaBabuOffl) September 8, 2020