ఒక నెలలో చిన్న హీరోల సినిమాలు విడుదలైతే, మరో నెలలో బడా హీరోల సినిమాలు వరుస కడుతున్నాయి. సెప్టెంబర్‌లో శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ తప్ప మరే సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ అందుకోలేక పోయింది. ఈ నెలలో కొన్ని సినిమాలు పరాజయం చవిచూస్తే.. మరి కొన్ని మిశ్రమ స్పందనలకే పరిమితమయ్యాయి.
సెప్టెంబర్ నెలలో పెద్ద సినిమాలేవీ విడుదలవ్వకపోవడంతో అందరి చూపు ఇప్పుడు అక్టోబర్ పైనే ఉంది. దీనికి మరో కారణం వచ్చే నెలలో బడా హీరోల సినిమాలు ఉండడం. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’, కింగ్ నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ సినిమాలు అలరించడానికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అభిమానులు ఈ సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించిన టీజర్, ఫస్ట్‌లుక్‌లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరి రానున్న అక్టోబర్ టాలీవుడ్‌కు ఎలా ఉంటుందో వేచి చూడాలి.
అయితే ఈ విషయం పై నాగార్జున ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ…‘‘ చిరంజీవిని చాలా మంది ఇష్టపడతారు. నేను మా ఇద్దరి సినిమాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయి. దసరా వస్తుందంటే ఒకేసారి రెండుమూడు సినిమాలు విడుదలవ్వడం గత 40 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. సినిమా బాగుంటే ఎన్ని సినిమాల మధ్య విడుదలైనా ప్రేక్షకాదరణ పొందుతుంది. ’’ అన్నారు.
మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘గాడ్ ఫాదర్’ తెరకెక్కుతోంది. పొలిటికల్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. నయనతార, సత్యదేవ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో నాగార్జున నటించిన సినిమా ‘ది ఘోస్ట్’. ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం అక్జోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.