రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి భువనేశ్వరి దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు. దీంతో.. వారానికి మూడుసార్లు ములాఖత్‍కు అవకాశం ఉన్నా తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు నారా భువనేశ్వరి. చంద్రబాబు అరెస్టు తర్వాత రాజమండ్రిలోనే ఉంటున్న నారా భువనేశ్వరి.. ములాఖత్‍పైనా ప్రభుత్వం అవమానీయంగా వ్యవహరిస్తోందన్నారు. నిబంధనల ప్రకారం ములాఖత్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా కాదనడం ఏంటని ఆమె మండిపడ్డారు.
అయితే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు ఢిల్లీ వెళ్లారు. అక్కడ మీడియాతో లోకేశ్ మాట్లాడుతూ.. ఏపీలో సంపూర్ణ అధికారం అవినీతికి పాల్పడుతుందన్నారు. అవినీతిపరులు నిజాయతీపరులను జైలుకు పంపుతారని, చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఇదే జరిగిందన్నారు. ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మనీ ట్రయిల్‌ను నిరూపించలేకపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అధికారాన్ని అంతా ఉపయోగించి రాష్ట్రప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసిందని, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో ఎలాంటి కుంభకోణం జరగలేదన్నారు లోకేశ్. జగన్ ప్రభుత్వం దుర్మార్గపు ఉద్దేశ్యంతో తప్పుడు కేసును సృష్టించిందని నిరూపించడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయించారన్నారు.