లోకేశ్‌ను కూడా అరెస్టు చేస్తారేమో?: బ్రాహ్మణి

కక్షసాధింపులో భాగంగానే చంద్రబాబు నాయుడును అరెస్టు చేశారని నారా బ్రాహ్మణి తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న పర్యటనలకు, లోకేశ్ యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తుండటంతో ప్రభుత్వం బాబును అరెస్టు చేసిందని అన్నారు. త్వరలో లోకేశ్ను కూడా అరెస్టు చేస్తారేమో? అని సందేహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాజమండ్రిలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న బ్రాహ్మణి ఈ వ్యాఖ్యలు చేశారు. “నారా చంద్రబాబునాయుడు చేసిన తప్పేంటి? ఆయన అభివృద్ధి చేశారు. సంక్షేమాన్ని అందించారు. లక్షలాదిమంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించారు. పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేలా బాటలు పరిచారు.

చంద్రబాబు నిర్దోషిగా బయటకొస్తారు: Nara Brahmini | Nara Brahmini said that  Chandrababu Naidu will be acquitted

అభివృద్ధి చేయడం, సంక్షేమం అందించడం, ఇన్ని ఉద్యోగాలు అందించడం నేరమా? ప్రస్తుత ప్రభుత్వ పాలనలో యువతకు ఉద్యోగాలు లభించడంలేదు. యువతను గంజాయి, మద్యానికి బానిసలుగా మార్చుతున్నారు. వారి భవిష్యత్తును ఇలా నాశనం చేయడం చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది. ప్రస్తుతం చంద్రబాబు ఇక్కడే రాజమండ్రిలో జైలులో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చేందుకు ఇంత మంది కదిలి వచ్చారంటే అదీ చంద్రబాబు గారి గొప్పదనం. ఇవాళ అన్ని వర్గాల వారు చంద్రబాబుకు బాహాటంగా మద్దతు ఇస్తున్నారు. నేడు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నవారిలో అత్యధికులు మహిళలే. వారిలో చాలామంది ఇంటిపట్టున ఉండే గృహిణులే. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.’ అని బ్రాహ్మణి వ్యాఖ్యానించారు.