యువగళం పేరిట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ యువగళం పాదయాత్ర నేడు కొండపి నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా కె.అగ్రహారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు. కొండపి ప్రాంతం ప్రాశస్త్యం, దివంగత సీనియర్ నేత దామచర్ల ఆంజనేయులు గురించి, పొగాకు రైతుల గురించి ప్రస్తావించారు. సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించడమే కాదు, కొంచెం హాస్యం కూడా ప్రదర్శించారు.
ఇవాళ కొండపి దద్దరిల్లిందని అన్నారు. తన సభకు వచ్చిన భారీ జనసందోహాన్ని చూసి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. చాన్నాళ్లుగా కొండపి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉందని తెలిపారు. “వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, వల్లూరమ్మ ఆలయం ఉన్న పుణ్యభూమి కొండపి. కొండపి రూపురేఖలు మార్చిన గొప్ప నేత దామచర్ల ఆంజనేయులు గారు. పొగాకు రైతుల కష్టాలు చూసి కొండపిలో పొగాకు బోర్డు ఏర్పాటు చేసింది స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారు. పవిత్రమైన కొండపి నేలపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని వివరించారు.
చంద్రయాన్ 3 సక్సస్ అయ్యింది. జగన్ కి కోపం వచ్చింది. మొన్న జగన్ టీవీ చూస్తుంటే ఇస్రో చంద్రయాన్ 3 సక్సస్ అయ్యింది అనే వార్త వచ్చింది. ఆ వార్త చూసి జగన్ కి విపరీతమైన కోపం వచ్చింది. దాంతో టీవీ పగలగొట్టేశాడు. వెంటనే ప్యాలస్ బ్రోకర్ సజ్జలని పిలిచి చితకబాదాడు.
పాపం, సజ్జలకి అర్ధం కాలేదు. అసలు నన్ను ఎందుకు తిడుతున్నాడు అనుకున్నాడు. భయపడుతూనే ఏం జరిగింది సార్ అన్నాడు సజ్జల. చంద్రయాన్ అని పేరు పెడితే ఏం పీకావ్? అధికారంలో ఉన్నది మనమా? చంద్రబాబా? అని అడిగాడు. జగన్యాన్ అని పేరు పెట్టకపోతే ఇస్రో దగ్గరకి జేసీబీ పంపుతాం అని వార్నింగ్ ఇవ్వాలి కదా అన్నాడు. అక్కడికి జేసీబీ పంపితే మనం జీవితాంతం చిప్పకూడు తినాల్సిందే సార్ అన్నాడట సజ్జల.