యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దూసుకెళ్తున్నారు. లోకేష్ పాదయాత్రకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. ప్రతీ చోట లోకేష్‌కు ఘన స్వాగతాలు పలుకుతున్నారు. పెద్దఎత్తున ప్రజలు యువగళం పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇవాళ ఆయన పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ ఘనత పట్ల లోకేశ్ స్పందించారు.
యువగళం పాదయాత్ర రాయలసీమ గడ్డపై 1000 కిమీ పూర్తి చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అరాచకాలను ఎండగట్టేందుకు యువగళం ఒక ఆయుధం వంటిదని పేర్కొన్నారు. ఈ పాదయాత్రపై యువత తమ మనోభావాలను తనతో పంచుకోవచ్చని లోకేశ్ సూచించారు.
“యువగళం పాదయాత్ర రాయలసీమ గడ్డపై 1000 కిలోమీటర్ల మైలురాయి చేరుకోవడానికి సహాయ, సహకారాలు అందించిన యావత్ రాయలసీమ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నేలపై 1000 కిలోమీటర్ల యాత్రను పూర్తిచేయడం నా అదృష్టంగా భావిస్తూ, నా యాత్రను సఫలీకృతం చేసిన ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను”. అని పేర్కొన్నారు నారా లోకేష్.