అన్ని రంగాల నిపుణులు జగన్ బాధితులే : లోకేశ్

-

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే బాధేస్తోందని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో వివిధ రంగాలకు చెందిన నిపుణులతో లోకేష్ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని రంగాల నిపుణులు బాధితులే అని అసహనం వ్యక్తం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంస పాలన ప్రారంభమైందని అన్నారు. అమర్ రాజా, రిలయన్స్, లులూ వంటి సంస్థలను రాష్ట్రం నుంచి తరిమేశారని ఆరోపించారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క మంచి కంపెనీ అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు.

Nara Lokesh Speech Yuva Galam Padayatra Day 9

జగన్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారని విమర్శించారు. జగన్ రూ.10 ఇచ్చి రూ.100 లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఇక, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్ గా తీర్చిదిద్దుతామని లోకేశ్ హామీ ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా పరిశ్రమలు తీసుకువస్తామని తెలిపారు. విద్యార్థులకు పాత ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. యూపీఎస్ ఎసీ తరహాలో ఏపీపీఎస్సీ ని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ, పెండింగ్ ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు భరోసానిచ్చారు. విశాఖను ఐటీ రాజధానిగా అభివృద్ధి చేస్తామని లోకేశ్ వివరించారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news