అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సీఎం జగన్ హామీ ఏమైందని.. టీడీపీ నేత లోకేశ్ ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్పై జగన్ మాటిచ్చి మడమ తిప్పారన్నారు. కల్తీ పురుగుల మందులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ‘సుఖీభవ’ కింద రైతుకు ఏటా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు సభలో లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
నిన్న అద్దంకి లో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని, సీఎం జగన్ తనపై వైసీపీ బీసీ నేతలతో మాటల దాడి చేయిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. బీసీలకు టీడీపీ హయాంలోనే న్యాయం జరిగిందన్నారు. బీసీలకు ఎవరు న్యాయం చేశారో తేలాలంటే బహిరంగ చర్చకు తాను సిద్ధమంటూ వైసీపీ నేతలకు లోకేష్ సవాల్ విసిరారు. సభలో మాట్లాడిన లోకేష్.. సైకో పోవాలి, సైకిల్ రావాలి అన్నారు. పచ్చ కండువాలు తిప్పుతూ టీడీపీ నేతలు పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపారు. అన్ని వర్గాలను మోసం చేసిన జగన్ కు బుద్ధి చెప్పాలంటే ప్రజలు టీడీపీకి ఓటు వేసి సైకో పాలనకు చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు.